వలస కార్మికుల కోసం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసిన కేంద్రం

  • Publish Date - April 14, 2020 / 11:30 AM IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్‌ను మే 3వరకూ పొడిగించడంతో దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి 20 కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసినట్టు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. లాక్‌డౌన్‌ పొడిగింపుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేసిన అనంతరం కార్మిక శాఖ ఈ వివరాలు వెల్లడించింది. 

కరోనా వైరస్ కేసుల తీవ్రత తగ్గితే ఏప్రిల్‌ 20 నుంచి కొన్ని ప్రాంతాల్లో షరతులతో కూడిన సడలింపును ప్రకటించవచ్చని ప్రధాని ప్రకటన ఆధారంగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గత మూడువారాలుగా అమల్లో ఉన్న లాక్‌డౌన్‌లో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రవాణా సౌకర్యాలు  లేకపోవటంతో  వారి వారి స్వస్ధలాలకు చేరుకోలేక వేలాది వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.  మరికొందరు వేతనాలు అందక..ఉద్యోగాలు కోల్పోయి మరికొందరు అసంఘటిత రంగ కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వలస కూలీల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని  దేశవ్యాప్తంగా ప్రధాన కార్మిక శాఖ కమిషనర్‌ ఆధ్వర్యంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖ 20 కంటోల్‌ రూంలను ఏర్పాటు చేసింది. 

ఈ కంట్రోల్‌ రూమ్‌లు కార్మికుల వేతనాలకు సంబంధించిన అంశాలతో పాటు వీరు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి పరిష్కరిస్తాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఫోన్‌ నెంబర్లు, వాట్సాప్‌, ఈమెయిల్స్‌ ద్వారా ఈ కాల్‌సెంటర్స్‌ను కార్మికులు సంప్రదించవచ్చని పేర్కొంది. కార్మికులు ఎవరైనా కాల్‌ సెంటర్స్‌లో ఆయా నెంబర్లకు ఫోన్‌ చేసి తమ సమస్యలను చెప్పుకోవచ్చని కార్మిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.