×
Ad

Parrots: గుండెలు పగిలే దృశ్యం.. ఆ గింజలు తిని 200 చిలుకలు మృతి.. పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయం

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో నర్మదా నది ఒడ్డున కనీసం 200 చిలుకలు మరణించాయని అధికారులు తెలిపారు. (Madhya Pradesh Parrots)

Parrots Representative Image (Image Credit To Original Source)

 

  • విషపూరిత ఆహారం కారణంగా 200 చిలుకలు మృతి
  • పక్షుల కడుపులో బియ్యం, గులకరాళ్లు
  • పక్షులకు ఆహారం వేసిన వంతెన దగ్గరికి వచ్చే పర్యాటకులు
  • చిలుకల మృతితో పక్షులకు ఆహారం ఇవ్వడంపై నిషేధం

Parrots: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖర్గోన్ లో గుండెలు పగిలే దృశ్యం కనిపించింది. చూడ ముచ్చటైన చిలుకలు విగత జీవులుగా మారాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200కుపైగా చిలుకలు మరణించాయి. నర్మదా తీరంలో ఈ హృదయ విదారక దృశ్యం కనిపించింది.

విషపూరిత ఆహారం వల్లే ఈ ఘోరం జరిగినట్లు పోస్టుమార్టంలో తేలింది. పర్యాటకులు వేసిన కలుషిత అన్నం లేదా విషం కలిపిన గింజల వల్లే అవి మరణించాయని తెలుస్తోంది. అది విషపూరిత ఆహారం అని పాపం ఆ మూగ ప్రాణాలు తెలుసుకోలేకపోయాయి. ఆహారం దొరికింది కదా అని తినేశాయి.అ అంతే ప్రాణాలు వదిలాయి. చిలుకలే కాదు పావురాలు కూడా ఆ ఆహారం తిని చనిపోయాయి. పెద్ద సంఖ్యలు చిలుకలు ఇలా చనిపోవడం పక్షి ప్రేమికులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. గుండె పగిలిపోయిందంటూ అంటూ కంట తడి పెడుతున్నారు.

పోస్టుమార్టం నివేదికలో బయటపడిన నిజం..

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో నర్మదా నది ఒడ్డున విషపూరిత ఆహారం కారణంగా కనీసం 200 చిలుకలు మరణించాయని అధికారులు తెలిపారు. గత నాలుగు రోజులుగా బద్వా ప్రాంతంలో నదీ తీరంలోని ఒక కాలువ వంతెన సమీపంలో పక్షుల మృతదేహాలు లభించాయి. పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోవడానికి బర్డ్ ఫ్లూ కారణం అని ముందు అనుకున్నారు. అయితే పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం బయటపడింది. వాటి మరణానికి బర్డ్ ఫ్లూ కారణం కాదని, విషం కలిసిన ఆహారం అని తేలింది.

అధికారులు రెస్కూ ఆపరేషన్ చేపట్టారు. వారు ఘటనా స్థలానికి వెళ్లిన సమయంలో నేలపై పడి ఉన్న చిలుకల్లో కొన్ని ప్రాణాలతో ఉండటం గమనించారు. వాటిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ లాభం లేకపోయింది. విష ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల అవి కాసేపటికే చనిపోయాయని జిల్లా వన్యప్రాణి వార్డెన్ టోనీ శర్మ చెప్పారు.

పక్షులకు ఆహారం ఇవ్వడంపై నిషేధం..

బర్డ్ ఫ్లూ భయం అనుమానంతో ఈ మరణాలు ఆ ప్రాంతంలో భయాందోళనలకు దారితీశాయి. కానీ పశువైద్య పరీక్షల్లో ఇన్ఫెక్షన్ జాడ కనిపించలేదు. ఈ ఘటన తర్వాత అటవీ శాఖ అధికారులు అక్విడక్ట్ వంతెన దగ్గర ఆహారం ఇవ్వడం నిషేధించారు. అంతేకాదు అక్కడ ఎవరూ ఆహారం వేయకుండా ఆ ప్రదేశంలో సిబ్బందిని నియమించారు.

పక్షుల అంతర్గత అవయవాల నమూనాలను తదుపరి పరీక్షల కోసం జబల్‌పూర్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. పశువైద్య శాఖ అధికారుల ప్రకారం, ఆహార విషప్రయోగం, సరైన ఆహారం లేకపోవడం వల్ల ఈ మరణాలు సంభవించాయి. నివాసితుల నుండి సమాచారం అందిన తర్వాత పశువైద్య, అటవీ శాఖలతో పాటు వన్యప్రాణి విభాగం బృందాలు గత నాలుగు రోజులుగా ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నాయి.

Parrot Representative Image (Image Credit To Original Source)

పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించిన పశువైద్యురాలు డాక్టర్ మనీషా చౌహాన్ దీనిపై మాట్లాడారు. చిలుకలలో బర్డ్ ఫ్లూకు సంబంధించిన ఎలాంటి సూచనలు లేవని తెలిపారు. ఆహార విష ప్రయోగం లక్షణాలు మాత్రమే కనిపించాయన్నారు. ప్రజలు తరచుగా వారికి తెలియకుండానే పక్షుల జీర్ణ వ్యవస్థకు ప్రాణాంతకంగా మారే ఆహారాన్ని తినిపిస్తారని చెప్పారు. మరణించిన పక్షుల కడుపులో బియ్యం, చిన్న గులకరాళ్లు కనిపించాయని పశువైద్య విస్తరణ అధికారి డాక్టర్ సురేష్ బఘేల్ తెలిపారు.

సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించినట్లు అనిపిస్తోందని అధికారులు తేల్చారు. పరుగు మందులు చల్లిన పంట పొలాల్లోని ఆహారం కూడా వీటి మరణాలకు కారణం అంటున్నారు. వంతెనను సందర్శించిన సందర్శకులు వండిన లేదా మిగిలిపోయిన ఆహారాన్ని పక్షులకు తినిపించడం వల్ల ప్రాణాంతకం అయి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.

Also Read: మీ దగ్గర ఇంకా రూ.2వేల నోటు ఉందా? RBI నుంచి మీకో బిగ్ అలర్ట్..