BV Raghavulu(Photo : Google)
2000 Rs Note Withdrawal : రూ.2వేల నోట్లను ఉపసంహరిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం రాజకీయరంగు పులుముకుంది. ఆర్బీఐ నిర్ణయం వెనుక కేంద్ర ప్రభుత్వం హస్తం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాయి. రూ.2వేల నోట్ల ఉపసంహరణపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆయన ఫైర్ అయ్యారు.
”గతంలో నోట్ల ఉపసంహరణ వల్ల ఏం లాభం చేకూరిందో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. నోట్ల రద్దుతో దేశంలో కొత్తగా జరిగింది లేదు. రూ.2వేల నోట్ల ఉపసంహరణపై పార్లమెంటులో చర్చ పెట్టాలి. ఆర్బీఐ నిర్ణయం వెనుక కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఉంది.
దీని వల్ల సన్న, చిన్న, మధ్య తరగతి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అవినీతిని కప్పి పెట్టేందుకే ఇలాంటి నిర్ణయాలు. చర్చను పక్కదారి పట్టించేందుకే 2000 రూపాయల నోటు ఉపసంహరణ తెరపైకి తెచ్చారు. 2 వేల రూపాయల ఉపసంహరణ నిర్ణయాన్ని ఆర్బీఐ వెంటనే వెనక్కి తీసుకోవాలి.
ఆర్థిక వ్యవస్థను కార్పొరేట్ చేతుల్లోకి తీసుకెళ్లేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉంది. గతంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. దేశంలో పెద్ద నోట్ల రద్దుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు” అని రాఘవులు అన్నారు.
Also Read..Rs 2000 denomination: మీ వద్ద రూ.2 వేల నోట్లు ఉంటే ఇలా మార్చుకోండి.. టెన్షన్ వద్దు.