RBI: రూ.2000 నోట్లను ఎందుకు రద్దు చేశారు? నోట్లు మార్చుకోకపోతే ఏమవుతుంది? మార్చుకోవడానికి ఫీజు చెల్లించాలా?

ఒకవేళ బ్యాంకులో రూ.2 వేల నోట్లను తీసుకోకపోతే ఏంటి సంగతన్న విషయంపై కూడా ఆర్బీఐ వివరణ ఇచ్చింది.

RBI: రూ.2000 నోట్లను ఎందుకు రద్దు చేశారు? నోట్లు మార్చుకోకపోతే ఏమవుతుంది? మార్చుకోవడానికి ఫీజు చెల్లించాలా?

RBI

Rs 2000 Denomination: రూ.2000 నోట్లను ఎందుకు రద్దు చేశారు? అనే విషయంపై ఆర్బీఐ (Reserve Bank of India) వివరణ ఇచ్చింది. 2016 నవంబరులో పెద్ద నోట్ల రద్దు (పాత రూ.500, రూ.1,000 నోట్ల రద్దు) కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజల కొనుగోలు అవసరాలకు వీలుగా రూ.2,000 నోట్లను తీసుకొచ్చామని తెలిపింది.

అనంతరం దేశంలో సరిపడా కొత్త నోట్ల ముద్రణ పూర్తవడంతో, 2018-19 ఆర్థిక ఏడాది రూ.2,000 నోట్ల ముద్రణను ఆపేశామని పేర్కొంది. ప్రజా అవసరాలకు తగ్గట్లుగా ఇతర కరెన్సీ నోట్లు ప్రస్తుతం ఉండడంతో “క్లీన్ నోట్ పాలసీ”లో భాగంగా రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు వివరించింది.

క్లీన్ నోట్ పాలసీ అంటే?

క్లీన్ నోట్ పాలసీ అంటే ఏంటో ఆర్బీఐ తెలిపింది. ప్రజలకు నాణ్యతతో కూడిన బ్యాంకు నోట్లను అందుబాటులో ఉంచడానికి తాము అనుసరిస్తోన్న విధానమే క్లీన్ నోట్ పాలసీ అని పేర్కొంది.

సాధారణ చలామణీలో వాడొచ్చా?
ప్రజలు ఇప్పుడు కూడా రూ.2 వేల నోటుని సాధారణంగానే వాడుకోవచ్చని ఆర్బీఐ పేర్కొంది. అయితే, ఈ ఏడాది సెప్టెంబరు 30లోపు అన్ని రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలి లేదా మార్పిడీ చేసుకోవాలి. అలాగే, బిజినెస్ కరస్పాండెంట్స్ రోజుకి రూ.4 వేల చొప్పున ఈ నోట్లను వాడుకోవచ్చు. బ్యాంకుల్లో డిపాజిట్ ఎంతైనా చేసుకోవచ్చు. రూ.2 వేల నోట్లు మార్చుకోవడానికి మాత్రమే రూ.20,000 నిబంధన ఉంది. ఏ బ్యాంకులోనైనా సరే ఒక విడతలో 10 రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు.

నోట్ల మార్చుకోవడానికి ఫీజు చెల్లించాలా?
నోట్ల మార్చుకోవడానికి బ్యాంకుల్లో ఏదైనా ఫీజు చెల్లించాలా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి ఆర్బీఐ సమాధానం ఇచ్చింది. నోట్ల మార్చుకోవడానికి ఏ ఫీజూ చెల్లించే అవసరం లేదని, ఉచితంగానే మార్చుకోవచ్చని పేర్కొంది.

వీరికి ప్రత్యేక ఏర్పాట్లు
వృద్ధులు, అంగవైకల్యం ఉన్నవారు బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకోవడానికి వస్తే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.

మార్చుకోకపోతే ఏమవుతుంది?
రూ.2 వేల నోట్లను ఎవరైనా బ్యాంకులో డిపాజిట్ చేయకపోయినా, మార్చుకోకపోయినా ఏమవుతుందన్న విషయంపై ఆర్బీఐ ఓ సమాధానం చెప్పింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా 5 నెలల గడువు ఇచ్చామని చెప్పింది. ఆ సమయంలో రూ.2 వేల నోట్లు మార్చుకోవాలని లేదా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని పేర్కొంది. ప్రజలను ఈ మేరకు ప్రోత్సహిస్తున్నామని మాత్రమే ఆర్బీఐ చెప్పింది.

బ్యాంకులో రూ.2 వేల నోట్లను తీసుకోకపోతే?

ఒకవేళ బ్యాంకులో రూ.2 వేల నోట్లను తీసుకోకపోతే ఏంటి సంగతన్న విషయంపై కూడా ఆర్బీఐ వివరణ ఇచ్చింది. మొదట ఆ బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయాలని పేర్కొంది. 30 రోజుల్లో ఆ బ్యాంకు అధికారులు కూడా స్పందించపోతే రిజర్వ్ బ్యాంకు (RB-IOS) కు ఫిర్యాదు చేయాలని చెప్పింది. అందుకు cms.rbi.org.in లో చూడొచ్చు.

Rs 2000 denomination: మీ వద్ద రూ.2 వేల నోట్లు ఉంటే ఇలా మార్చుకోండి.. టెన్షన్ వద్దు..