రెస్క్యూ మిషన్ : చైనా నుంచి వచ్చిన భారతీయులు..ఎంతమంది వచ్చారంటే

  • Publish Date - February 1, 2020 / 02:53 AM IST

భారతీయులను ప్రభుత్వం వెనక్కి తీసుకువస్తోంది. మొదటి విడతగా 324 మందిని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించింది. 2020, జనవరి 31వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి చైనా వెళ్లిన ఎయిరిండియా బోయింగ్‌  ఫ్లైట్ ‘అజంతా’… రాత్రి 10 గంటల తర్వాత అక్కడి నుంచి తిరుగు ప్రయాణమైంది. 2020, ఫిబ్రవరి 01వ తేదీ శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది.

వుహాన్‌ నుంచి తీసుకొచ్చిన భారతీయులను వెంటనే వారివారి స్వస్థలాలకు పంపించకుండా.. ఢిల్లీ సమీపంలోని మనేసర్‌లో భారత సైన్యం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వైద్య శిబిరాలకు తరలించారు. వారంతా ఇక్కడ రెండు వారాలపాటు వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. ప్రత్యేక విమానంలో వచ్చిన వారందరికీ విమానాశ్రయంలోనే ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. కరోనా లక్షణాలు కనిపించిన వారిని ఢిల్లీ కంటోన్మెంట్‌ బేస్‌ హాస్పిటల్‌లోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించి చికిత్స చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. 

వుహాన్‌లో మిగిలిపోయిన మరికొంతమంది భారతీయులను తీసుకొచ్చేందుకు 2020, జనవరి 01వ తేదీ శనివారం మరో విమానాన్ని చైనాకు పంపనున్నారు. ఈ రెస్క్యూ మిషన్‌కు కెప్టెన్‌ అమితాబ్‌ సింగ్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఎయిరిండియా ఈ తరహా మిషన్లను గతంలో లిబియా, ఇరాక్‌, యెమన్‌, కువైట్‌, నేపాల్‌లో చేపట్టింది. 1990 ఆగస్టులో లక్ష మందికి పైగా భారతీయులను 488 విమానాల్లో 59రోజుల్లో తరలించిన చరిత్ర ఎయిరిండియాకు ఉంది.

2015లో ఆపరేషన్‌ రాహత్‌ పేరుతో యెమన్‌ నుంచి భారతీయులను తీసుకొచ్చింది. చైనా నుంచి వస్తున్న వారితోపాటు.. ఇక్కడి నుంచి వెళ్లిన సిబ్బందికి ఆ మహమ్మారి కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. విమానంలో ఐదుగురు వైద్యులతోపాటు, మందులు, మాస్కులు, ఓవర్‌ కోట్లను అందుబాటులో ఉంచారు. 

Read More : కరోనా ఎక్కడ సోకుతుందేమోనని..శవాన్ని పట్టించుకోలేదు