ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌బరస్ట్.. నలుగురి మృతి, 50 మందికిపైగా గల్లంతు.. గ్రామంలోకి వరద ప్రవాహం ఎంత పెద్ద ఎత్తున వచ్చిందో చూడండి..

“హోటళ్ల నుంచి మార్కెట్ల వరకు అంతా సర్వనాశనం అయింది. ఇలాంటి విపత్తు నేను ఎప్పుడూ చూడలేదు” అని ఒక ప్రత్యక్షసాక్షి మీడియాకు చెప్పారు.

ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌బరస్ట్.. నలుగురి మృతి, 50 మందికిపైగా గల్లంతు.. గ్రామంలోకి వరద ప్రవాహం ఎంత పెద్ద ఎత్తున వచ్చిందో చూడండి..

Updated On : August 5, 2025 / 5:29 PM IST

ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌బరస్ట్ వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అకస్మాత్తుగా పెద్ద ఎత్తున వరదలు రావడంతో ఇళ్లు కొట్టుకుపోయాయి. ఉత్తరకాశి జిల్లా ధరాలి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం సుమారు 1.45 గంటలకు క్లౌడ్‌బరస్ట్ సంభవించింది.

హర్సిల్ వద్ద భారత సైన్య శిబిరానికి 4 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. గంగోత్రి ధామానికి రహదారి మార్గాలు పూర్తిగా తెగిపోయాయి. బురద నీరు ఒక్కసారిగా దిగువకు ప్రవహించడంతో ఇళ్లు మునిగిపోయాయి. దీంతో నలుగురు మృతి చెందగా, 50 మందికిపైగా గల్లంతయ్యారు.

కొండలపై నుంచి తెగివచ్చిన వరద నీటి ప్రవాహంతో చెట్లు, ఇళ్లు కొట్టుకుపోతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంఆది. “హోటళ్ల నుంచి మార్కెట్ల వరకు అంతా సర్వనాశనం అయింది. ఇలాంటి విపత్తు నేను ఎప్పుడూ చూడలేదు” అని ఒక ప్రత్యక్షసాక్షి మీడియాకు చెప్పారు.

హర్సిల్ ప్రాంతంలోని ఖీర్ గడ్ డ్రెయిన్ పొంగిపొర్లడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఉత్తరకాశి పోలీస్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, సైన్యం సహా అనేక బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతానికి సమీపంలో ఉన్న సైన్యం మొదటిగా స్పందించి దాదాపు 15 మందిని రక్షించింది.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ ఘటనపై స్పందిస్తూ.. “ధరాలి ప్రాంతంలో క్లౌడ్‌బరస్ట్‌ వల్ల సంభవించిన విధ్వంసం చాలా బాధాకరం. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, జిల్లా యంత్రాంగం సహా పలు బృందాలు యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్నాయి” అని ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ 16 మంది సభ్యులతో కూడిన బృందం ఇప్పటికే ధరాలికి చేరుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరాఖండ్ సీఎం ధామికి ఫోన్ చేసి, అన్ని రకాల సాయం అందించనున్నట్లు హామీ ఇచ్చారు.

“ఉత్తరాఖండ్‌లో ధరాలి వద్ద మేఘవర్షం వల్ల సంభవించిన ఫ్లాష్ ఫ్లడ్ గురించి సీఎం ధామితో మాట్లాడాను. సమీపంలోని మూడు ఐటీబీపీ బృందాలు ఘటనాస్థలికి వెళ్లాయి. నాలుగు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా అక్కడకు వెళ్తున్నాయి. వీరు త్వరలో సహాయక చర్యలు ప్రారంభిస్తారు” అని అమిత్ షా ట్వీట్ చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. “ధరాలి ఘటనలో బాధితుల పట్ల సానుభూతి తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి ధామితో మాట్లాడి పరిస్థితిని సమీక్షించాను. రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో సహాయక చర్యలు జరుగుతున్నాయి. బాధితులకు అవసరమైన సాయం అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం” అని మోదీ ట్వీట్ చేశారు.

జిల్లా యంత్రాంగం తెలిపిన వివరాల ప్రకారం వరుస వర్షాలతో రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో సహాయక చర్యలకు తీవ్రంగా ఆటంకాలు ఎదురవుతున్నాయి.