Omicron Variant : మరో 4 ఒమిక్రాన్ కేసులు.. ఆ రాష్ట్రంలో 32కి పెరిగిన కొత్త వేరియంట్ బాధితులు

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్ లో కలవరం రేపుతోంది. దేశంలో క్రమంగా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్..

Omicron Cases In India

Omicron Variant : యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్ లో కలవరం రేపుతోంది. దేశంలో క్రమంగా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఆందోళనకు గురి చేస్తోంది.

ఆ రాష్ట్రంలో ఈ ఒక్కరోజే 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 32కి పెరిగింది. ఉస్మానాబాద్ లో ఇద్దరు, ముంబై, బుల్దానాలో ఒక్కొక్కరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు అధికారులు గుర్తించారు. కాగా, దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ సోకిన వారి సంఖ్య 65కి చేరింది.

కరోనా మహమ్మారి ఏడాదికిపైగా వణికించింది. యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కాగా, ఇప్పుడిప్పుడే మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ప్రపంచం కోలుకుంటోంది. హమ్మయ్య అని ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇంతలోనే కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్.. వణుకు పుట్టిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్‌.. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటికి పాకుతోంది. మన దేశంలోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

WhatsApp Group Admins : వాట్సాప్ గ్రూపు అడ్మిన్లకు న్యూ పవర్..? అందరి మెసేజ్‌లు డిలీట్ చేయొచ్చు!

ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ భౌగోళిక ముప్పుగా పరిణమిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. గతంలో బయటపడ్డ డెల్టా వేరియంట్‌ కంటే వేగంగా వ్యాపిస్తూ ఇప్పటికే అనేక దేశాలకు పాకింది. కానీ, ఇప్పటికీ.. ఒమిక్రాన్‌ వ్యాధి తీవ్రత, లక్షణాలపై స్పష్టమైన సమాచారం రావట్లేదు. అయితే ఒమిక్రాన్‌ సోకిన బాధితుల్లో డెల్టా కంటే భిన్నమైన లక్షణాలు కన్పిస్తున్నాయని దక్షిణాఫ్రికాకు చెందిన ఓ డాక్టర్‌ వెల్లడించారు. ఈ వేరియంట్‌ బారిన పడిన కొందరు రాత్రిళ్లు విపరీతమైన చెమటతో బాధపడుతున్నారని అన్నారు.

‘‘ఒమిక్రాన్‌ బారిన పడిన వారిలో భిన్నమైన లక్షణాలు కన్పిస్తున్నాయి. అయితే అవి స్వల్పంగానే ఉన్నాయి. కొవిడ్ 19 సాధారణ లక్షణాలైన దగ్గు, తరచూ ముక్కు కారడం, గొంతు నొప్పి, తీవ్రమైన జ్వరం వంటివి కొత్త వేరియంట్‌ బాధితుల్లో లేవు. ఒమిక్రాన్‌ సోకినవారు ఎక్కువగా తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, స్వల్ప జ్వరం, అలసట, గొంతులో దురదతో బాధపడుతున్నారు’’ అని డాక్టర్‌ ఏంజెలిక్‌ కాట్జీ తెలిపారు. టీకాలు తీసుకోని వారిలో తలనొప్పి, ఒళ్లు నొప్పులు విపరీతంగా ఉంటున్నాయని చెప్పారు.

కొందరు బాధితుల్లో మాత్రం అసాధారణ లక్షణాలు కన్పిస్తున్నాయని ఏంజెలిక్‌ అన్నారు. అవి డెల్టా కంటే పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు. ‘‘ఈ వేరియంట్‌ సోకిన బాధితులకు అలసట, బలహీనతతో పాటు రాత్రిపూట విపరీతమైన చెమటలు పడుతున్నాయి. ఎంతలా అంటే ఈ చెమట కారణంగా వారి దుస్తులు, బెడ్‌ కూడా తడిసిపోతున్నట్లు వారు చెబుతున్నారు. చాలా మందిలో ఈ లక్షణం కన్పిస్తోంది’’ అని డాక్టర్ వెల్లడించారు. ఇక గొంతు గరగర కూడా ఎక్కువగా ఉంటోందన్నారు. అయితే డెల్టా సోకిన వారు వాసన కోల్పోగా.. ఒమిక్రాన్‌ సోకిన బాధితుల్లో ఆ లక్షణం కన్పించట్లేదని తెలిపారు.

Whole Grain Diet : చిరుధాన్యపు ఆహారంతో బరువు తగ్గొచ్చు తెలుసా?..

ఒమిక్రాన్ వేరియంట్‌ బాధితులకు చికిత్స అందిస్తున్న వారిలో డాక్టర్‌ ఏంజెలిక్‌ కూడా ఒకరు. తన దగ్గరికి వస్తున్న పేషెంట్ల లక్షణాలను బట్టి ఈ నిర్ధారణకు వచ్చినట్లు డాక్టర్‌ తెలిపారు. అయితే మందులతో ఈ వేరియంట్‌ నుంచి కోలుకుంటున్నట్లు చెప్పారు. ఈ లక్షణాలు కన్పించిన వారు వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ సూచించారు.