జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేశారనే సమాచారం కలకలం రేపుతోంది. సరిహద్దు వెంట సుమారు 40 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో కశ్మీర్ లోయలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రధానంగా సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడే ప్రమాదం ఉండటంతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి.
ఉగ్రవాదులు నియంత్రణ రేఖ దాటి జమ్ముకశ్మీర్‌లోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆగస్టు 5 నుంచి ఇప్పటివరకు సుమారు 40 మంది ఉగ్రవాదులు చొరబడ్డారు. గత 40 రోజుల్లో ఇంత పెద్ద ఎత్తున చొరబాట్లు జరగడం ఇదే తొలిసారి. ఉగ్రవాదులకు జైష్ ఎ మొహమ్మద్, లష్కరే తోయిబా సంస్థలతో సంబంధం ఉన్నట్లు నిఘావర్గాలు వెల్లడించాయి.
పాకిస్తాన్ గత కొన్ని రోజులుగా సరిహద్దులో వందలాది ఉగ్రవాదులను మోహరించింది. ఎలాగైనా వారిని కశ్మీర్‌లోకి పంపించేందుకు అన్ని యత్నాలు చేస్తోంది. అయితే వారి ప్రతి కదలికపై భారత రక్షణ బలగాలు ఓ కన్నేసి ఉంచాయి. లోయలో కమ్యునికేషన్ వ్వవస్థను నిలిపివేయడంతో ఉగ్రవాద కార్యకలాకాలకు ఆటంకంగా మారిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఫోన్లు లేకపోవడంతో ఆర్మీకి కూడా ఇబ్బందులు తప్పడం లేదు.
కెరన్ సెక్టార్‌లోకి ఉగ్రవాదుల ప్రవేశానికి సంబంధించిన వీడియోను ఇటీవల ఆర్మీ విడుదల చేసింది. ఆగస్టు 3న పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్‌కు చెందిన ఓ దళం సరిహద్దులోకి చొరబడేందుకు చేసిన యత్నం విఫలమైంది. నలుగురు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టింది. వారి శవాలను తీసుకెళ్లేందుకు పాక్ నిరాకరించింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం సరిహద్దుల వెంట భద్రతను కట్టుదిట్టం చేసింది. మరోవైపు ఇప్పటికే దేశంలోకి చొరబడ్డారని అనుమానిస్తున్న ఉగ్రవాదుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది.
Read More : భూమిపై 2050 తర్వాత ఫుడ్ దొరకదట