Trending: వారానికి ఐదు రోజులే బ్యాంకులు.. ట్రెండింగ్ లోకి #5DaysBanking

అక్టోబర్ 1 నుంచి నిరసన కార్యక్రమానికి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంపాయిస్ అసోసియేషన్ (AIBEA) పిలుపు ఇవ్వడంతో #5DaysBanking ట్రెండింగ్ లోకి వచ్చింది.

5 days banking in trending and AIBEA call for no late sitting

Trending Bank Holidays: సోషల్ మీడియాలో #5DaysBanking శనివారం ట్రెండింగ్ లోకి వచ్చింది. బ్యాంకులు వారానికి 5 రోజులు మాత్రమే పనిచేసేలా అనుతించాలన్న దానిపై గత కొద్ది రోజులుగా చర్చ నడుస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులపై పనిభారం ఎక్కువగా ఉందని, తగినంత సిబ్బంది లేకపోవడంతో బ్యాంకు ఉద్యోగులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న వాదనలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రతిపాదన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్ లో ఉంది.

ఇప్పుడున్న ప్రాసెస్ ప్రకారం వారానికి 6 రోజులు బ్యాంకులు పనిచేస్తున్నాయి. ప్రతి ఆదివారం బ్యాంకులకు సెలవు. ప్రతి నెల 2, 4 శనివారాల్లో కూడా బ్యాంకులు పనిచేయవు. వీటితో పాటు పండుగలప్పుడు కూడా బ్యాంకులకు సెలవులు ఉంటున్నాయి. అయితే గత కొంత కాలంగా బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ నెమ్మదించింది. దీంతో సరిపడా సిబ్బంది లేక ఉద్యోగులపై అధిక పనిభారం పడుతోంది. ఫలితంగా పనిగంటలు ముగిసిన తర్వాత కూడా బ్యాంకుల్లో అదనపు సమయం ఉండాల్సి వస్తోందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారానికి రెండు రోజులు వీకాఫ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

దాదాపు ఇప్పుడు 80 శాతం లావాదేవీలు డిజిటల్‌గా జరుగుతున్నాయి. ఖాతాదారులు ఫిర్యాదులను పరిష్కరించడానికి, లావాదేవీలు నిర్వహించడానికే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోందని బ్యాంకు ఉద్యోగులు అంటున్నారు. అధిక పనిభారంతో ఒత్తిడి పెరుగుతోందని వాపోతున్నారు. ఒక్కోసారి 12 గంటలు కూడా పనిచేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. వారానికి రెండు రోజులు వీకాఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.

వారానికి ఐదు రోజుల పని విధానానికి ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (IBA) కూడా ఆమోదం తెలిపింది. ఆగస్టులో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం ఈ ప్రతిపాదనను పంపించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విధానానికి కేంద్రం ఓకే అంటే.. బ్యాంకులు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పనిచేస్తాయి. అయితే రోజువారీ పనిగంటల సమయం 45 నిమిషాలు పెరుగుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తర్వాత ఈ ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం కోసం పంపాల్సి ఉంటుంది.

Also Read: దుష్టశక్తుల్ని దరిచేరనివ్వని గురివింద గింజ‌లు..

ఆఫీస్ అవర్స్ లో మాత్రమే ఉండండి
కాగా, అక్టోబర్ 1 నుంచి నిరసన కార్యక్రమానికి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంపాయిస్ అసోసియేషన్ (AIBEA) పిలుపు ఇవ్వడంతో #5DaysBanking ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇక నుంచి ఆఫీస్ అవర్స్ (ఉ.9.45 నుంచి సా.4.45) ముగిసిన తర్వాత ఉద్యోగులెవరూ అదనపు సమయం ఉండొద్దని AIBEA ఈ నెల 25న విడుదల చేసిన ప్రకటనలో కోరింది. తగినంత సిబ్బందిని నియమించాలన్న తమ డిమాండ్ ను యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో ఈ మేరకు నిరసన చేపడుతున్నట్టు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా చాలా బ్యాంకుల్లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఉద్యోగులపై అదనపు పనిభారం పడుతోందని తెలిపింది. కాగా, డిసెంబరు 4 నుంచి వచ్చే ఏడాది జనవరి 20 వరకు వివిధ స్థాయిల్లో సమ్మె చేపడతామని AIBEA ఇప్పటికే ప్రకటించింది.