ఈ జీతాలతో బతకలేం : 577 మంది కానిస్టేబుళ్లు రాజీనామా

  • Published By: veegamteam ,Published On : April 20, 2019 / 05:38 AM IST
ఈ జీతాలతో బతకలేం : 577 మంది కానిస్టేబుళ్లు రాజీనామా

Updated On : April 20, 2019 / 5:38 AM IST

టైటిల్ చూసి షాక్ అయ్యారా.. ఏంటీ గవర్నమెంట్ ఉద్యోగం.. ఒకటో తేదీ జీతం.. ఒంటిపై ఖాకీ.. చేతిలో లాఠీతోపాటు పవర్.. ఇంకేం ఇంకేం కావాలీ అనుకుంటారు అందరూ.. వాళ్లు మాత్రం అలా అనుకోలేదు.. తొక్కలో కానిస్టేబుల్ ఉద్యోగం అనుకున్నారు.. రిజైన్ చేసి పారేశారు.. ఇది జరిగింది ఎక్కడో తెలుసా.. కర్నాటకలో. అవును ఇది నిజం. కేవలం 4 సంవత్సరాల్లో 577 మంది కానిస్టేబుళ్లు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. కర్నాటక పోలీస్ శాఖలో కలకలం రేపుతున్న ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా..
– 2014-2018 మధ్య కర్నాటక రాష్ట్రంలో 21వేల 491 మందిని పోలీస్ కానిస్టేబుళ్లుగా రిక్రూట్ చేసుకుంది. వీరిలో 12వేల 408 మంది సివిల్ పోలీసులు. 5వేల 060 మంది సిటీ ఆర్మ్ డ్ రిజర్వ్/డిస్ట్రిక్ ఆర్మ్ డ్ రిజర్వ్ కింద సెలక్ట్ చేసింది. మరో 4వేల 023 మందిని కర్నాటక స్టేట్ రిజర్వ్ పోలీస్ కింద ఎంపిక చేసింది.

– వీళ్లందరూ శిక్షణ పూర్తి చేసుకుని డ్యూటీలో జాయిన్ అయ్యారు.
– ఊహించని విధంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వీరిలో 577 మంది రాజీనామా చేశారు. వీరిలో సివిల్ కానిస్టేబుళ్లు 337 మంది ఉన్నారు. సిటీ, డిస్ట్రిక్, స్టేట్ రిజర్వ్ కేటగిరీలో ఉద్యోగం చేస్తున్న వాళ్లు మరో 93 మంది ఉన్నారు.

కానిస్టేబుళ్ల రాజీనామాకు కారణాలు ఇవే :
డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ నెల జీతం 25వేలు నుంచి 28వేల వరకు వస్తుంది. కటింగ్స్ పోను 20 నుంచి 23వేల వరకు చేతికి వస్తుంది. ఇది ఏ మాత్రం సరిపోవటం లేదంట. ప్రతి ఏటా వేసే ఇంక్రిమెంట్ 500 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన ప్రమోషన్, జీతం బాగా పెరగాలి అంటే ఓ కానిస్టేబుల్ 15 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకోవాలి. అదే బయట ఓ క్యాబ్ డ్రైవర్ నెలకు కనీసం 25వేలు సంపాదిస్తున్నాడు. కాల్ సెంటర్ ఉద్యోగి కనీస వేతం 20వేలపైనే ఉంటుంది. టాలెంట్ ఉంటే రెండేళ్లలో ఎక్కడికో వెళ్లిపోవచ్చు. ప్రైవేట్ కంపెనీల్లోనూ అవకాశాలు బాగా ఉంటున్నాయి. సంపాదించుకోవటానికి మార్గాలు ఎక్కువ ఉంటాయి. దీంతో వందల సంఖ్యలో కానిస్టేబుళ్లు రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. కానిస్టేబుల్ గా 30-40 సంవత్సరాలు సర్వీస్ చేస్తే రిటైర్ అయిన తర్వాత వచ్చే పెన్షన్ కూడా 25 వేల నుంచి 40వేల మధ్యన మాత్రమే ఉంటుంది.

కానిస్టేబుళ్లకు వీక్లీ ఆఫ్ లేవు. 24 గంటల డ్యూటీ. కుటుంబంతో గడిపే సమయం ఉండదు. పై అధికారుల వేధింపులు, ఒత్తిడి కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు కర్నాటక పోలీస్ శాఖ ఉన్నతాధికారులు. జీతం, వీక్లీ ఆఫ్ లు లేకపోవటం, పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపుల వల్లే కానిస్టేబుళ్లు రాజీనామా చేసి పోతున్నారని చెబుతున్నారు సీనియర్స్. రాజీనామా చేసిన వారిలో ఎక్కువ మంది బ్యాచిలర్స్. డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్న వారు.

రాజీనామా చేసిన కానిస్టేబుళ్లు ఎక్కువగా టీచింగ్, బ్యాంకింగ్, రైల్వే, కాల్ సెంటర్, క్యాబ్ బిజినెస్ ఇలాంటి వాటిలోకి వెళ్లారని.. ఇంత కంటే ఎక్కువ జీతం సంపాదిస్తున్నట్లు వెల్లడించారు. ఆయా ఉద్యోగాల్లో పని ఒత్తిడి, వేధింపులు తక్కువగా ఉంటాయని అభిప్రాయం కూడా వారు వ్యక్తం చేయటం విశేషం. మొత్తానికి కర్నాటక రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పి వెళ్లిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది పోలీస్ శాఖకు.