70దేశాలకు 583లక్షల భారత వ్యాక్సిన్లు..ఫిన్లాండ్ ప్రధానితో మోడీ

PM Narendra Modi భారత తయారీ కోవిడ్-19 వ్యాక్సిన్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. వ్యాక్సిన్లు కావాలంటూ వివిధ దేశాలు భారత్ ను అభ్యర్థిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇవాళ ఫిన్​లాండ్ ప్రధాని సన్నా మారిన్​తో వర్చువల్​ గా జరిగిన సమావేశం సమయంలో ప్రధాని మోడీ ప్రస్తావించారు.

మంగళవారం(మార్చి-16,2021)ఫిన్​లాండ్​ ప్రధాని సన్నా మారిన్​తో ప్రధాని మోడీ వర్చువల్​గా సమావేశమయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఓ వైపు కరోనా కష్టాలను ఎదుర్కొంటూనే భారత్​.. ఇతర దేశాలకు సాయంగా నిలిచిందని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 2020లో 150కి పైగా దేశాలకు మెడిసిన్స్ మరియు ఇతర ముఖ్య వస్తువులను భారత్ నుంచి పంపిచామని మోడీ తెలిపారు. గడిచిన కొద్ది వారాలుగా 70 దేశాలకు 583 లక్షల వ్యాక్సిన్ డోసులను భారత్ అందించిందని తెలిపారు.

భారత్- ఫిన్​లాండ్​ నియమాల ఆధారిత, పారదర్శక, మానవతా, ప్రజాస్వామ్య ప్రపంచ క్రమాన్ని విశ్వసిస్తాయని మోడీ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణ, క్లీన్​ ఎనర్జీ, పర్యావరణం, విద్య వంటి రంగాల్లో ఇరు దేశాలు బలమైన సహకారాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. అంతర్జాతీయ సోలార్ కూటమి​ మరియు డిజాస్టర్​ రెసిలియంట్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్(CDRI)​లో చేరాలని ఫిన్​లాండ్​ ప్రధానిని మోడీ కోరారు. ఈ రెండు సంస్థలు భారత్​ ప్రతిపాదన మేరకు ఏర్పడ్డాయి. ఫిన్​లాండ్​ సామర్థ్యం, నైపుణ్యాల ద్వారా ఈ రెండు అంతర్జాతీయ సంస్థలు ప్రయోజనం పొందుతాయని మోడీ అన్నారు. విద్య, సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్యం వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి అవకాశం ఉందని ఫిన్​లాండ్ ప్రధాని సన్నా మారిన్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు