×
Ad

రిక్షాలో భార్యను కూర్చోబెట్టి 300 కి.మీ తీసుకెళ్లిన వృద్ధుడు.. ఎందుకో తెలిస్తే కన్నీరు అపుకోలేరు..

సంబల్‌పూర్ నుంచి కటక్ వరకు 9 రోజుల పాటు ప్రయాణించాడు.

75-Year-Old's 300 Km Rickshaw Odyssey To Get Wife Treated (Image Credit To Original Source)

  • ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో ఘటన
  • భార్యకు చికిత్స చేయించడానికి తీసుకెళ్లిన వృద్ధుడు
  • సంబల్‌పూర్ నుంచి కటక్ వరకు 9 రోజులు ప్రయాణం

Odisha: రిక్షాలో భార్యను కూర్చోబెట్టి 300 కిలోమీటర్లు తీసుకెళ్లాడు ఓ వృద్ధుడు. ఆమెకు వైద్య చికిత్స అందించడం కోసం ఆయన అంతగా కష్టపడాల్సి వచ్చింది.

ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లా మోదీపాడా గ్రామానికి చెందిన బాబు లోహార్ (75) భార్య జ్యోతి (70) స్ట్రోక్‌కు గురైంది. స్థానిక వైద్యులు వైద్య పరీక్షలు చేసి కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ప్రత్యేక చికిత్స అవసరమని సూచించారు.

ప్రైవేట్ అంబులెన్స్‌కు డబ్బు లేకపోవడంతో లోహార్ తన సైకిల్ రిక్షాను తాత్కాలిక అంబులెన్స్‌లా మార్చి, అందులోనే ఆమెను కూర్చోబెట్టాడు. సంబల్‌పూర్ నుంచి కటక్ వరకు 9 రోజుల పాటు ప్రయాణించాడు.

పగలు రిక్షా తొక్కుతూ, రాత్రుళ్లు రోడ్డు పక్క ఆశ్రయం పొందాడు. వయస్సు మీద పడ్డా, శారీరకంగా అలసిపోతున్నా తన భార్య కోసం పట్టువిడవలేదు. చివరకు ఆసుపత్రికి చేరుకున్నాడు. అక్కడ జ్యోతి 2 నెలలు తీవ్ర చికిత్స పొందింది. జనవరి 19న ఆ దంపతులు తిరుగు ప్రయాణం ప్రారంభించారు.

Also Read: మీ వాహనాలపై ప్రెస్‌, పోలీస్‌, అడ్వొకేట్‌ వంటివి రాయించుకుంటున్నారా? మీకే ఈ వార్నింగ్..

అయితే చౌద్వార్ సమీపంలో ఒక వాహనం రిక్షాను ఢీకొనడంతో మరో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వృద్ధ మహిళకు తీవ్రమైన గాయాలయ్యాయి. సమీప ఆరోగ్య కేంద్రంలో చికిత్స కోసం ఆ దంపతుల ప్రయాణం తాత్కాలికంగా ఆగింది.

గాయాలకు చికిత్స పొందిన తర్వాత కూడా లోహార్ వెనక్కి తగ్గలేదు. “మాకు ఇంకెవ్వరూ లేరు.. మేమిద్దరమే ఉన్నాం” అని చెబుతూ సంబల్‌పూర్ చేరుకునేందుకు మళ్లీ ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఆరోగ్య కేంద్రంలోని వైద్య సిబ్బంది ఆ దంపతుల పరిస్థితిని గమనించారు. ప్రమాదం తర్వాత చికిత్స చేసిన డాక్టర్ వికాస్.. వైద్య సహాయంతో పాటు వ్యక్తిగతంగా ఆర్థిక సాయం చేసి గమ్యానికి చేరుకునేలా తోడ్పడ్డారు.