Shoe Rack Fine: సిటీస్ లోని అపార్ట్ మెంట్లు, విల్లాల్లో ఉండే కండీషన్లు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. వాటి యజమానులు, అసోసియేషన్ పెద్దలు అందులో రెంట్ కు ఉండే వారికి పెట్టే రూల్స్ చాలా చిత్రంగా ఉంటాయి. కొన్ని నిబంధనలు షాక్ కి గురి చేస్తాయి. మ్యాటర్ ఏంటంటే.. బెంగళూరులో జరిగిన ఓ ఘటన నెటిజన్లను తీవ్ర విస్మయానికి గురి చేస్తోంది. ఓ అపార్ట్ మెంట్ లో పెట్టిన నిబంధనలు తెలిసి విస్తుపోతున్నారు. అపార్ట్ మెంట్ కారిడార్ లో షూ ర్యాక్ పెట్టాడని ఓ వ్యక్తికి ఏకంగా 24వేల రూపాయలు జరిమానా వసూలు చేశారు
పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నగరం ఎలక్ట్రానిక్ సిటీలోని ప్రెస్టీజ్ సన్ రైజ్ పార్క్ అపార్ట్ మెంట్ లో జరిగిన ఘటన చర్చకు దారితీసింది. ఆ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే ఓ వ్యక్తి జరిమానా చెల్లిస్తున్నాడు. తన ఇంటి ఫ్రంట్ డోర్ బయట షూ ర్యాక్ ఉంచడమే ఇందుకు కారణం. అపార్ట్ మెంట్ నిబంధనల ప్రకారం ఇంటి బయట షూ ర్యాక్ ఉంచకూడదు. అలా చేస్తే రోజుకు 100 రూపాయల ఫైన్ కట్టాల్సి ఉంటుంది.
Also Read: ఏసీలు పేలుతున్నాయ్.. మీ ఇంట్లో పేలకుండా ఉండాలంటే అర్జంట్ గా ఈ ఛేంజెస్ చేయండి..
అయితే, ఆ వ్యక్తి డోంట్ కేర్ అన్నాడు. ఫైన్ కట్టేందుకు రెడీ అయిపోయాడు. అలా రోజుకు 100 రూపాయల జరిమానా చెల్లిస్తున్నాడు. అలా ఇప్పటికి ఆ జరిమానా మొత్తం 24వేల రూపాయలైంది. ఇక ఇప్పుడు అపార్ట్ మెంట్ పెద్దలు.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 100 రూపాయలుగా ఉన్న జరిమానాను డబుల్ అంటే 200 రూపాయలు చేయాలనే ప్లాన్ లో ఉన్నారట.
ప్రెస్టీజ్ సన్ రైజ్ పార్క్ లో 1046 ఇళ్లు ఉన్నాయి. ఆ అపార్ట్ మెంట్ లో పలు నిబంధనలు ఉన్నాయి. అక్కడ నివాసం ఉండే వారంతా కచ్చితంగా వాటిని పాటించాల్సిందే. లేదంటే జరిమానా విధిస్తారు. కామన్ స్పేసస్ లో పలు రకాల వస్తువులు ఉంచరాదని నిబంధనలు పెట్టారు. షూ ర్యాక్, పాటడ్ ప్లాంట్స్, స్టోరేజ్ క్యాబినెట్స్ తదితరాలు కామన్ స్పేసస్ లో ఉంచడానికి వీల్లేదు. అయితే కమ్యూనిటీ గైడ్ లైన్స్ ను ఉల్లంఘించి సగం మందికి పైగా ఆ వస్తువులను ఇంటి ప్రాంగణంలో పెడుతున్నారు.
ఇది గమనించిన అపార్ట్ మెంట్ ఆసోసియేషన్ పెద్దలకు కోపం వచ్చింది. వెంటనే వారితో సమావేశం అయ్యారు. నిబంధనలు పాటించాలని కోరారు. అంతేకాదు పద్ధతి మార్చుకోవాలని రెండు నెలల సమయం కూడా ఇచ్చారు. దాంతో చాలా మందిలో మార్పు వచ్చింది. నిబంధనలు పాటించడం ప్రారంభించారు. కానీ, ఒక వ్యక్తి మాత్రం తగ్గేదేలే అన్నట్లు ప్రవర్తించాడు. అతడు తన షూ ర్యాక్ ని అక్కడి నుంచి తొలగించడానికి ఒప్పుకోలేదు.
అవసరమైతే ఫైన్ కట్టేందుకు కూడా నేను రెడీ.. షూ ర్యాక్ మాత్రం అక్కడి నుంచి తీసేది లేదని తేల్చి చెప్పాడు. అంతేకాదు.. జరిమానా కింద ఏకంగా అడ్వాన్స్ గా రూ.15వేలు కూడా ఇచ్చాడు. ఈ డబ్బుని తన ముందస్తు పెయిడ్ జరిమానాగా పరిగణించాలన్నాడు. అలా గత 8 నెలలుగా అతడు ఫైన్ కడుతూనే ఉన్నాడు. ఇప్పటివరకు 24వేల రూపాయలు జరిమానాగా చెల్లించాడీ వ్యక్తి.