60 వేల నాణేలతో రాముడు, అయోధ్య రామ మందిరానికి మద్దతు

Lord Ram : హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు అందుతున్నాయి. తన ఆరాధ్య దైవం రాముడి మందిర నిర్మాణంలో తామూ భాగస్వామ్యం కావాలని దేశవ్యాప్తంగా హిందువులు భావిస్తున్నారు. ఇందుకు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. పలువురు వినూత్నంగా మద్దతు తెలియచేస్తున్నారు. తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటున్నారు. రామసేతును ప్రతిబింబించేలా 48 అడుగుల పొడవైన కేకును సూరత్‌కు చెందిన బ్రెడ్ లైనర్ బేకరీ రూపొందించింది. ఇలా..కొంతమంది వినూత్నంగా..ప్రయత్నిస్తున్నారు.

తాజాగా..కర్నాటకకు చెందిన ఓ కళాకారుడు వినూత్నంగా మద్దతు తెలిపాడు. రఘుయా బడే అనే కళాకారుడు రూపాయి, ఐదు రూపాయల నాణేలతో అయోధ్య రామమందిరం నమూనాను కళాత్మకంగా రూపొందించారు. మొత్తం రూ. 2 లక్షల విలువైన 60 వేల నాణేలను వినియోగించినట్లు బడే వెల్లడించారు. బెంగ‌ళూరులోని లాల్‌బాగ్ వెస్ట్‌గేట్ వ‌ద్ద ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచారు. ఈ నిర్మాణం విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

500 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం మందిర నిర్మాణం జరుగుతుండటంతో ఆలయ కమిటీ సైతం పెద్ద ఎత్తున నిధులను సేకరిస్తోంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా అయోధ్యలో రామమందిరం నిర్మించాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యులు భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల గ్రామాల్లో 11 కోట్లు కుటుంబాలను ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యులను చేయాలని నిర్ణయించారు.

దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా నిధులను సమీకరిస్తున్నారు. ఫిబ్రవరి 27 వరకు విరాళాలు మరింత పెరిగే అవకాశం ఉందని తీర్థక్షేత్ర నిర్వహకులు తెలిపారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు దేశవ్యాప్తంగా విరాళాల కార్యక్రమాన్ని చేపట్టారు. అయోధ్యలోని 2.7 ఎకరాల స్థలంలో రామమందిర నిర్మాణం జరుగుతోంది. 15 వందల కోట్లతో ఆలయాన్ని నిర్మించాలని ప్రణాళికలు తయారు చేయగా ఇప్పటికే ఆ మార్క్‌ దాటేసింది.