Rare Incident In Delhi AIIMS (1)
Rare Incident In Delhi AIIMS : ఢిల్లీ ఎయిమ్స్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఏడు నెలలుగా అపస్మారకస్థితిలో ఉన్న ఓ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్‌కు చెందిన మహిళ ఈ ఏడాది మార్చి 31న తన భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు బలమైన దెబ్బ తగిలింది.
దీంతో ఆమె తలకు పలు సర్జరీలు చేయాల్సి వచ్చింది. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినప్పటికీ ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కళ్లు తెరుస్తుంది కానీ కదల్లేని స్థితిలో ఉండిపోయింది. అయితే, ప్రమాద సమయంలో ఆమె గర్భవతి అని వైద్యులు గుర్తించారు. ఇక అప్పటి నుంచి ఆ మహిళ ఆసుపత్రిలోనే అచేతన స్థితిలో చికిత్స పొందుతోంది.
ఏప్రిల్ 1న తెల్లవారుజామున సదరు మహిళ ప్రాణాపాయ స్థితిలో ఢిల్లీ ఎయిమ్స్‌కు వచ్చిందని ఎయిమ్స్ న్యూరోసర్జన్ డాక్టర్ దీపక్ గుప్తా పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె 40 రోజుల గర్భిణి అని తెలిపారు. కడుపులో శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని.. కుటుంబ సభ్యులు అబార్షన్‌కు ఒప్పుకోలేదని చెప్పారు.
దీంతో నెలలు నిండిన ఆమెకు ఇటీవల ప్రసవం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చిందని.. పాలిచ్చే పరిస్థితుల్లో లేదని వివరించారు. ఆ పసికందుకు డబ్బా పాలు పడుతున్నట్లు డాక్టర్ దీపక్ గుప్తా వెల్లడించారు.