రాష్ట్రాల్లో పాగా వేసేందుకు AAP స్కెచ్‌లు

  • Publish Date - February 13, 2020 / 07:22 PM IST

ఢిల్లీ ఎన్నికల్లో విజయం..ఆ పార్టీకి కొత్త ఉత్సాహం నింపింది. ఇక ఇతర రాష్ట్రాల్లో పాగా వేయాలని స్కెచ్‌లు వేస్తోంది. ఇందుకు పార్టీని బలోపేతం చేసేందుకు..ముందున్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలని ఆయా రాష్ట్రాలకు చెందిన ఆప్ నేతలు భావిస్తున్నారు. త్వరలో బీహార్ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్ చేసింది. 

బెంగళూరు నగరంపై ప్రస్తుతం ఆప్ కన్ను పడింది. అక్కడ త్వరలో జరగబోయే..కార్పొరేషన్ ఎన్నికలను చక్కగా ఉపయోగించుకోవాలని ఆ పార్టీకి చెందిన కీలక నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇక్కడ మొత్తం 198 వార్డులున్నాయి. అన్నీ వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టాలని పార్టీ యోచిస్తోంది. BBMP ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నట్లు, ఢిల్లీ ఎన్నికల ఫలితాలను ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తామని కర్నాటక ఆప్ కో కన్వీనర్ శాంతలా డామ్లే ఓ జాతీయ సంస్థకు వెల్లడించారు. ఇప్పటికే ఆప్ పూర్తి స్థాయిలో పనిచేస్తోందని, ప్రజల వద్దకు చేరువకావడానికి ప్రణాళికలు రచించామన్నారు. 

బెంగుళూరు నగరంలో పది కార్యాలయాలను ఇప్పటికే తెరిచారు. ‘Hosa Bengaluru’ పేరిట ఓ సినిమాను రూపొందించింది ఆప్. 50 ప్రదర్శనలు నిర్శహించారు పార్టీ నేతలు. ప్రతి వార్డులో ప్రజలతో మమేకం కావాలని, వారితో సమస్యలపై చరించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులను పార్టీ ఖరారు చేసినట్లు సమాచారం. ఢిల్లీలో ఆప్ విజయం సాధించడంతో బెంగళూరులోని ఆప్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఆప్ పార్టీకి చెందిన టోపీలు ధరించి..లగే రహో కేజ్రీవాల్ సాంగ్‌కు డ్యాన్స్‌లు చేశారు. ముంబై ఎన్నికలతో సహా రాబోయే స్థానిక ఎన్నికల్లో పోరాడాలని మహారాష్ట్ర యూనిట్ నిర్ణయించింది.