ఆప్ కి బిగ్ షాక్ : పంజాబ్ నుంచి మరో ఎమ్మెల్యే ఔట్

ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. పంజాబ్ లోని జైతూ నియోజకవర్గం ఎమ్మెల్యే బలదేవ్ సింగ్ ఆప్ కు రాజీనామా చేస్తున్నట్లు బుధవారం(జనవరి 16,2019) ప్రకటించారు. బలదేవ్ రాజీనామాతో పంజాబ్ నుంచి రాజీనామా చేసిన ఆప్ ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు చేరింది. కేజ్రీవాల్ ఓ నియంతలా, అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఈ ఏడాది జనవరి 6న పంజాబ్  ఎమ్మెల్యే సుఖ్ పాల్ సింగ్ ఖైరా ఆప్ కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జనవరి 8న పంజాబీ ఏక్తా పార్టీ పేరుతో ఆయన కొత్త పార్టీ స్థాపించారు. సుల్ పాల్ సింగ్ కు బలదేవ్ సన్నిహితుడు. 

బలదేవ్ బుధవారం తన రాజీనామా లేఖను ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు పంపారు. పార్టీ మౌలిక సిద్ధాంతాలను తుంగలో తొక్కుతున్నందున  పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని కేజ్రీవాల్ కు రాసిన లేఖలో బలదేవ్ తెలిపారు. అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం తనను కదిలించడంతో ఆప్ లో చేరానని, హెడ్ మాస్టర్ ఉద్యోగం వదులుకొని పంజాబ్ లో రాజకీయ-సామాజిక సరిస్థితిని మెరుగుపర్చేందుకు  ఆప్ లో చేరానని, అయితే ప్రస్థుతం పార్టీలో జరుగుతున్న పరిమాణాలు తనకు నచ్చకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో బలదేవ్ తెలిపారు. కేజ్రీవాల్ కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తుందని, ఇది పచ్చి రాజకీయ అవకాశవాదమేనని బలదేవ్ అన్నారు. కేజ్రీవాల్ దళిత వ్యతిరేకి అని తెలిపారు.