అక్కడ కూడా చీపురు ఊడ్చేస్తుందా ?.. ఆ రాష్ట్రంపై ఆప్ చూపు

  • Publish Date - February 9, 2020 / 11:08 AM IST

ఒక రాజకీయ పార్టీ. ఒక రాష్ట్రంలోనే ఉండకూడదు అనుకుంటుంది. ఇతర రాష్ట్రాల్లో పాగా వేయాలని, సీట్లు సంపాదించుకోవాలని ఆరాట పడుతుంటాయి. కొన్ని పార్టీలు సక్సెస్ అవుతే..మరికొన్ని పార్టీల ప్రయత్నాలు నెరవేరవు. ఇప్పడు ఆప్ పార్టీ కూడా ఓ రాష్ట్రంపై కన్నేసింది. అక్కడ పాగా వేసేందుకు ముందుగానే వ్యూహాలు రచిస్తోంది. అధికారంలోకి వచ్చేందుకు..ప్రజల మన్ననలు పొందేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలు రచిస్తోంది. ఇంతకీ ఏ రాష్ట్రం వైపు చూస్తుందో అనేది తెలుసుకోవాలంటే స్టోరీ చదవాల్సిందే. 

 

ఆప్..ఢిల్లీ పీఠంపై మరోసారి కూర్చొబోతోంది. హ్యాట్రిక్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకోనుంది. 2020, ఫిబ్రవరి 08వ తేదీ 70 నియోజకవర్గాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. బీహార్ రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఈ రాష్ట్రంపై కన్నేసింది. అయితే..ఇక్కడ ఆప్ 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసింది. కిషన్ గంజ్, భాగల్ పూర్, సీతామర్హి‌లో పోటీ చేసి పరాజయం చెందింది. 

అలాగే…2014లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆప్ పాగా వేయాలని ప్రయత్నించింది. 40 సీట్లకు గాను 39 సీట్లలలో పోటీ చేసింది. కానీ ఎక్కడా గెలుపొందలేదు. 2015లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసింది ఆప్ పార్టీ. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బీహార్ ఆప్ చీఫ్ సాహూ పాల్గొన్నారు. త్వరలో బీహార్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఆప్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. జనతాదళ్ (యునైటెడ్), రాష్ట్ర జనతాదళ్, కాంగ్రెస్ పార్టీలు ఆప్‌కు వ్యతిరేకంగా పోరాడాయని గుర్తు చేశారు.

 

క్షేత్రస్థాయిలో ఇప్పటికే పార్టీని బలోపేతం చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు, జన్ సంవాద్ యాత్ర పేరిట ప్రజల్లోకి వెళుతున్నట్లు తెలిపారు. మీడియా తరపున ఎలాంటి సహకారం అందడం లేదని, కానీ మాస్ గ్రూప్ ప్రోత్సాహిస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 26 జిల్లాల్లో యాత్ర జరిగిందని, మిగిలిన ప్రాంతాల్లో 2020, ఫిబ్రవరి 20వ తేదీ నుంచి యాత్రను ప్రారంభించనున్నట్లు వెల్లడించారాయన. 

సాధారణ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలకు దగ్గర కావాలని, వారి సమస్యలను దూరం చేసేందుకు కృషి చేస్తామని, ఈ సందర్భంగా తాము ఎలాంటి కూటమిలో చేరమని ఖరాఖండిగా చెప్పారు. బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంతో నితీష్ కుమార్‌ పాలనతో ప్రజలు సంతృప్తిగా లేరని, ఆర్జేడీ లీడర్ తేజశ్వీ ప్రసాద్ యాదవ్‌‌లో ప్రత్యామ్నాయాన్ని చూడలేరని వ్యాఖ్యానించారు.

 

పాత ఆర్జేడీ పాలన ఎలా ఉందో ఇప్పటికీ ప్రజల మనస్సులో మెదులుతోందని, తాము సరికొత్త ప్రత్యామ్నాయాన్ని ప్రజలకు అందిస్తామని హామీనిచ్చారు. విద్య, రోడ్లు, ఆరోగ్యం, పేదలకు అవసరమౌన మౌలిక సదుపాయాలపై తాము దృష్టి సారించడం జరిగిందని, తాము ప్రజల ముందు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు బీహర్ ఇన్ ఛార్జీ సంజయ్ సింగ్, పార్టీ కీలక నేతలు బీహార్‌‌లో గడపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీహార్‌లో పార్టీని బలోపేతం చేసే దిశగా వీరు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు.