శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆసుపత్రిలో చేరిన సంజయ్ దత్

  • Publish Date - August 9, 2020 / 06:56 AM IST

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ముంబైలోని లీలవతి ఆసుపత్రిలో చేరారు. అయితే కరోనా లక్షణాలు కనిపించడంతో సంజయ్ దత్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా.. నివేదిక ప్రతికూలంగా వచ్చింది. దీంతో అతనిని నాన్-కోవిడ్ ఐసియు వార్డులో చేర్చారు. ప్రస్తుతం సంజయ్ దత్ ఆరోగ్యం బాగుందని లీలావతి ఆసుపత్రి ప్రకటన విడుదల చేసింది. కానీ కొంతకాలం ఆయన వైద్య పరిశీలనలో ఉంచవచ్చు.

సంజయ్ దత్ సోదరి ప్రియా దత్ మాట్లాడుతూ ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడడంతో సంజయ్ దత్‌ను ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉన్నట్లుగా చెప్పారు. రాత్రి తన ట్వీట్‌లో సంజయ్ దత్.. ‘నేను బాగున్నానను. ఎవరూ భయపడకండి.. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాను. కోవిడ్ -19 నివేదిక నెగెటివ్ వచ్చింది. లీలవతి ఆసుపత్రి డాక్టర్లు, నర్సుల సంరక్షణలో ఒకటి లేదా రెండు రోజులు ఉండి ఇంటికి వచ్చేస్తాను. నా ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న అందరికీ ధన్యవాదాలు.’ అని రాసుకొచ్చారు.

62 ఏళ్ల సంజయ్ దత్.. దివంగత నటుడు సునీల్ దత్ మరియు నటి నర్గిస్ కుమారుడు. అతని ఇద్దరు సోదరీమణులు ప్రియా దత్, నమ్రత దత్. సంజయ్ దత్‌కు ఇద్దరు పిల్లలు, ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె ఉన్నారు. జూలై 29న సంజయ్ దత్ 62వ పుట్టినరోజు జరుపుకున్నారు.

సంజయ్ దత్ రెండు సినిమాలు ‘సడక్ -2’, ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’లో సంజయ్‌తో పాటు నటుడు అజయ్ దేవగన్ కూడా కనిపిస్తారు. ఇక సంజయ్ దత్ KGFలో కూడా కనిపించనున్నాడు. కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌లో, సంజయ్ దత్ అధీరా పాత్రలో కనిపించనున్నారు, దీని ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలైంది. ఇందులో సంజయ్ దత్ తల మరియు ముఖం మీద పచ్చబొట్లు కనిపించాయి.