Adar Poonawalla Is The Only Official Spokesperson Serum Institute Says After Executive Director Criticises Govt
Serum Institute వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతూ సీరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ జాదవ్ చేసిన విమర్శలపై ఆ సంస్థ అధికారికంగా వివరణ ఇచ్చింది. సురేశ్ జాదవ్ వ్యాఖ్యలతో సీరమ్ కు సంబంధం లేదని సీరం సంస్థ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ కేంద్రానికి వివరణ ఇచ్చారు. అవి సురేశ్ జాదవ్ వ్యక్తిగత అభిప్రాయాలేనని.. వాటితో కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు.
ఈ మేరకు సీరం డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్.. కేంద్ర ఆరోగ్యశాఖకు లేఖ రాశారు. కంపెనీ సీఈఓ అదర్ పూనావాలా తరఫున లేఖ రాస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరులో భాగంగా కొవిషీల్డ్ ఉత్పత్తిని భారీగా పెంచేందుకు తాము కట్టుబడి ఉన్నామని లేఖలో వివరించారు. పూనావాలా మాత్రమే కంపెనీ అధికార ప్రతినిధి అని, ఆయన వ్యాఖ్యలనే పరిగణనలోకి తీసుకోవాలని తేఖతో వివరించారు.
కాగా, దేశంలో ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉన్న సమయంలో శుక్రవారం ఓ ఆన్ లైన్ హెల్త్ సమ్మిట్ లో సీరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ జాదవ్ మాట్లాడుతూ..వ్యాక్సిన్ల స్టాక్‌ను గానీ, డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాలను గానీ ప్రభుత్వం పట్టించుకోకుండా వివిధ వయసుల వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించిందన్నారు. తగినన్ని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో లేవని తెలిసి కూడా ప్రభుత్వం..45 ఏళ్లు దాటినోళ్లకు,18ఏళ్లు దాటినోళ్లకు వ్యాక్సినేషన్ ప్రారంభించిందని జాదవ్ తెలిపారు. అయితే, సురేశ్ జాదవ్ వ్యాఖ్యలపై భిన్న స్పందనలు రావడంతో సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తాజాగా కేంద్రానికి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.