2019ఎన్నికలపై సుప్రీంకోర్టులో పిటీషన్: పోలైన ఓట్లు.. ఓటర్ల అంకెల్లో తేడా

  • Publish Date - December 14, 2019 / 03:27 AM IST

కాంగ్రెస్ పార్టీతో సహా దేశంలో అనేక పార్టీలు ఇటీవల 2019 ఏప్రిల్, మే నెలల్లో జరిగిన ఎన్నికలపై అసంతృప్తిగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అనే అనుమానం అనేక పార్టీలు వ్యక్తం చేశాయి. లేటెస్ట్‌గా ఇదే లోక్‌సభ ఎన్నికల్లో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ జరపాలంటూ శుక్రవారం పిటీషన్ దాఖలైంది.

దేశంలోని 347 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యకు, పోలైన ఓట్లకు మధ్య తేడాలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్‌ (ఏడీఆర్‌), కామన్‌ కాజ్‌ అనే రెండు స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటీషన్‌ను స్వీకరించిన సుప్రీం కోర్టు  ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ పిటీషన్లపై వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల కమీషన్‌ని ఆదేశించింది. 

ఇప్పటికి ఇప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోకపోయినా.. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఇటువంటి తేడాలు రాకుండా ఓ పటిష్టమైన పద్ధతి రూపకల్పన చేయాలని ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని పిటీషనర్లు కోరారు. ఎన్నికల ఫలితాలను ప్రకటించే ముందుగా అంకెలను స్పష్టంగా లెక్కపెట్టాలని అంకెల్లో తేడా కారణంగా అనేకమందికి ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కోరాయి సంస్థలు.

అలాగే 2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల పత్రాలు 17సీ, 20, 21సీ, 21డీ, 21ఈల సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలని ఏడీఆర్‌ కోరింది. ఫలితాల కచ్చితత్వం, అంకెల్లోని తేడాల కారణంగా వచ్చే అనుమానాలను తీర్చేందుకు  ఎన్నికల కమిషన్ ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని చెప్పుకొచ్చారు పిటీషనర్లు.