CJI B R Gavai
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ వైపుగా ఓ అడ్వకేట్ (71) షూ విసిరి కలకలం రేపారు. సుప్రీంకోర్టులో ప్రొసీడింగ్స్ జరుగుతోన్న సమయంలోనే ఇవాళ ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అడ్వకేట్ విసిరిన షూ.. బెంచ్ వరకు వెళ్లలేదు.
సీజేఐ జస్టిస్ గవాయ్‌పై దాడికి యత్నిస్తుండగా అడ్వకేట్‌ను తోటి లాయర్‌లు అడ్డుకున్నారు. సనాతన ధర్మానికి అవమానం జరిగితే తాము ఊరుకోబోమని ఆ అడ్వకేట్ నినాదాలు చేశారు.
దీనిపై స్పందించిన జస్టిస్ గవాయ్ ఇలాంటి దాడులు తమను ప్రభావితం చేయబోవని చెప్పారు. సుప్రీంకోర్టుకు చేరుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాకేశ్ కిషోర్ అనే అడ్వకేట్ తన స్పోర్ట్స్ షూను తీసి ఉదయం 11.35 గంటలకు కోర్టు నం.1 లో విచారణ జరుగుతుండగా సీజేఐ జస్టిస్ గవాయ్‌పై విసిరారు.
“అడ్వకేట్‌ను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. సుప్రీంకోర్టు భద్రతా విభాగానికి అప్పగించారు. రాకేశ్ కిశోర్ మయూర్ విహార్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడిగానూ ఉన్నారు” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ప్రాథమిక దర్యాప్తులో పలు వివరాలు తెలిశాయి. ఇటీవల మధ్యప్రదేశ్ ఖజురాహో దేవాలయ సముదాయంలో విష్ణుమూర్తి విగ్రహ పునరుద్ధరణపై దాఖలైన పిటిషన్ విచారణ సమయంలో జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలపై అడ్వకేట్ రాకేశ్ అసంతృప్తితో ఉన్నారు.
జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌తో కలిసి బెంచ్‌లో విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ గవాయ్ సెప్టెంబర్ 16న ఖజురాహో దేవాలయ సముదాయంలోని జవారి ఆలయంలో 7 అడుగుల విష్ణు విగ్రహం పునర్నిర్మాణం కోసం వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.
“ఇది పూర్తిగా పబ్లిసిటీ ఇంటెరెస్ట్ పిటిషన్… వెళ్లి ఆ దేవుడినే అడుగు ఏదైనా చేయాలని. నువ్వు విష్ణుమూర్తి భక్తుడివని చెబుతున్నావు కాబట్టి ప్రార్థనలు చేయి, ధ్యానం చేయి” అని పిటిషనర్‌కి గవాయ్ చెప్పారు. ఆ తర్వాత సీజేఐ గవాయ్ దీనిపై వివరణ ఇస్తూ “నేను అన్ని మతాలను గౌరవిస్తాను” అని అన్నారు.