వాళ్లకు దేశంలో నివసించే హక్కులేదు…హర్యానా సీఎం హెచ్చరిక

  • Publish Date - September 21, 2019 / 04:26 PM IST

అనుమతుల్లేకుండా విదేశీయులు భారత్ లో నివసించే హక్కు లేదని హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ అన్నారు. జాతీయ పౌరుల జాబితా (ఎన్‌ఆర్‌సీ)ని తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని ప్రకటించిన హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్  ఇవాళ మరింత ఘాటుగా స్పందించారు. అనుమతి లేకుండా విదేశీయులు భారత్‌లో నివసించడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. 

సెప్టెంబర్ 21, శనివారం చండీఘడ్ లో జరిగిన ఓ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ‘‘ఎన్ఆర్‌సీ అనేది దేశవ్యాప్త నిర్ణయమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా చెప్పింది. హర్యానాతో పాటు అన్ని రాష్ట్రాల్లోనూ ఇది అమలవుతుంది. ఇతర దేశాలకు చెందిన పౌరులు అనుమతి లేకుండా ఇక్కడ ఉండడానికి వీల్లేదు..’’ అని అన్నారు. 

కాగా ఎన్‌ఆర్‌సీ అనేది బీజేపీ ఎన్నికల అంశం కానే కాదని, దేశ ప్రయోజనాలను రక్షించే చర్య అని కట్టర్ చెప్పుకొచ్చారు. కాగా దీన్ని ఎన్నికల సమస్యగా చూడోద్దని  ఆయన కోరారు. వచ్చే నెలలో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే సీఎం ఈ మేరకు వ్యాఖ్యానించడం గమనార్హం.   దీపావళికి ముందే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే ఆశాభావాన్ని కట్టర్ వ్యక్తం చేశారు. హర్యానాకు చెందిన ఇద్దరు పెద్ద ప్రతిపక్ష నేతలు చేరినందున 75 స్దానాలకు పైగా గెలుస్తామనే ధీమా ఆయన వ్యక్తం చేశారు.