AIADMK Poll Manifesto Release : అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల.. ఉచిత వాషింగ్‌మెషిన్‌.. ఉచిత కేబుల్‌ టీవీ..

తమిళనాడులో అన్నాడీఎంకే తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికార పార్టీ అన్నాడీఎంకే మేనిఫెస్టోను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విడుదల చేశారు.

Aiadmk Releases Poll Manifesto For Assembly Elections 2021

AIADMK Poll Manifesto Release : తమిళనాడులో అన్నాడీఎంకే తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికార పార్టీ అన్నాడీఎంకే మేనిఫెస్టోను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆదివారం (మార్చి 14) విడుదల చేశారు. మొత్తంగా 164కు పైగా స్కీముల హామీలను మేనిఫెస్టోలో అధికారిక పార్టీ మొత్తంగా 164 హామీలను పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచింది.

ఎప్పటిలానే ఈసారి ఎన్నికల్లో కూడా ఉచిత పథకాలకు పెద్దపీట వేశారు. ఉచిత వాషింగ్‌ మెషిన్లు, కేబుల్‌ టీవీ వంటివి అందిస్తామని హామీలు గుప్పించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ఉచిత వాషింగ్‌మెషిన్లు, ఉచిత సోలార్‌ స్టవ్‌లు, అందరికీ ఉచిత కేబుల్‌ టీవీ సౌకర్యం కల్పిస్తామని అన్నాడీఎంకే మేనిఫెస్టోలో వెల్లడించింది. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. రేషన్‌ సరకులను ఇంటికే అందించే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది.

ప్రతి కుటుంబానికి ఏటా 6 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు అందిస్తామని పేర్కొంది. అమ్మ హౌసింగ్‌ పథకం కింద ఇళ్లు నిర్మిస్తామని తెలిపింది. ఏటా పొంగల్‌కు ఇచ్చే రూ.2,500 నగదు పథకం కొనసాగుతుందని పేర్కొంది. మహిళలకు సిటీ బస్సుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తామని హామీ ఇచ్చింది. శ్రీలంక తమిళ శరణార్థులకు ద్వంద్వ పౌరసత్వం, విద్యారుణాల రద్దు, మద్యం దుకాణాల తగ్గింపు, పెట్రోల్‌ డీజిల్‌ ధరలు తగ్గింపునకు చర్యలు తీసుకుంటామని హామీలు గుప్పించింది. పౌరసత్వ సవరణ చట్టం 2019ను రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తామని తెలిపింది.

ఇంకా 12 నెలల మెటర్నిటీ లీవ్, వృద్ధాప్య పింఛన్ రూ.2వేలు, విద్యార్థులకు రుణమాఫీ, ఏడాదంతా కాలేజీ విద్యార్థులకు 2GB ఫ్రీ డేటా, ఉపాధి హామీ పనిదినాలను 100 నుంచి 150 దినాలకు పెంచుతామని పేర్కొంది. ఆటో రిక్షాలు కొనుగోలు చేయాలనుకునేవారికి రూ.25వేలు సబ్సిడీ అందిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచింది. 234 మంది సభ్యులు గల తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరుగనున్నాయి. మే 2న ఓట్ల లెక్కింపు జరుగనుంది.