అయోధ్య కమిటీపై అసద్ అసహనం

అయోధ్య భూవివాదం కేసులో ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ కమిటీలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ నియామకాన్ని తప్పుబట్టారు ఎమ్ఐఎమ్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. అయోధ్య విషయంలో ముస్లింలు తమ వాదనను వదిలిపెట్టకపోతే భారత్ మరో సిరియాలా తయారవుతుందన్న శ్రీశ్రీ రవిశంకర్ ను మధ్యవర్తిగా ఎలా నియమిస్తారని అసదుద్దీన్ ప్రశ్నించారు. శ్రీశ్రీకి బదులుగా తటస్థంగా ఉండే వ్యక్తిని సుప్రీం నియమించి ఉంటే బాగుండేదన్నారు. అయోధ్య విషయంలో శ్రీశ్రీ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు.

గతేడాది ఓ కార్యక్రమంలో పాల్గొన్నశ్రీశ్రీ రవిశంకర్..అయోధ్య వివాదంపై ముస్లింలు తమ ఆరోపణలు నిరూపించాలని, అయోధ్య ముస్లింలకు నమ్మకమైన ప్రదేశం కాదన్నారు. వివాద ప్రదేశంలో దేవుడిని కొలవడాన్ని ఇస్లాం అనుమతించదన్నారు. వేరే ప్రదేశంలో రాముడు పుట్టాడని మనం చెప్పలేం అని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

అయోధ్య భూవివాదంలో శాశ్వత పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కూడిన మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేస్తూ శుక్రవారం(మార్చి-8,2019) సుప్రీం నిర్ణయం తీసుకుంది. శ్రీశ్రీ రవిశంకర్, జస్టిస్ ఎఫ్ఎమ్ఐ ఖలిఫుల్లా,సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచులు ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీకి చైర్ పర్శన్ గా జస్టిస్ ఎఫ్ఎమ్ఐ ఖలిఫుల్లా వ్యవహరించనున్నారు. నాలుగు వారాల్లోగా కమిటీ స్టేటస్ రిపోర్ట్ పూర్తి అవ్వాలని,ఎనిమిది వారాల్లోగా ప్రొసీడింగ్స్ పూర్తి అవ్వాలని సుప్రీం ఆదేశించింది.

ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లోనే ఈ కమిటీ ప్రొసీడింగ్స్ అన్నీ జరగాలని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీనికి అనుగుణంగా అవసరమైన ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది.మధ్యవర్తిత్వ ప్రొసీడింగ్స్ అన్నీ కాన్ఫిడెన్షియల్ గా కెమెరా సమక్షంలోనే జరగాలని కోర్టు సూచించింది.