Kerala Lottery: అదృష్టం ఎప్పుడు, ఎవరిని వరిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఓ పెయింట్ల షాప్ చిరుద్యోగికి ఏకంగా రూ.25 కోట్ల లాటరీ తగిలింది.
కేరళలోని ఆలప్పుళ జిల్లా తురవూరుకు చెందిన శరత్ ఎస్.నాయర్ “ఓణం బంపర్ లాటరీ”లో ప్రథమ బహుమతిగా ఇంత నగదును గెలుచుకున్నారు. కొచ్చిలోని నెట్టూరులో నిప్పాన్ పెయింట్స్‌లో పనిచేస్తున్న శరత్ విజేత టికెట్ (టీహెచ్ 577825) నెట్టూరులోనే కొనుగోలు చేశారు. ఆయన సోమవారం తురవూరులోని థైకట్టుస్సేరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో టికెట్ సమర్పించారు.
లాటరీలో వచ్చిన రూ.25 కోట్లలో 30% ఆదాయపు పన్ను, సుమారు రూ.2.5 కోట్ల ఏజెంట్ కమిషన్ పోగా శరత్‌కు రూ.15.75 కోట్లు వచ్చే అవకాశం ఉంది.
Also Read:: గూగుల్ మ్యాప్స్‌లో మీరు ఎక్కిన బస్సు కదలికలు.. మీ అర చేతుల్లోనే ఈ సమాచారం అంతా…
ఈ విషయంపై శరత్ మాట్లాడుతూ… “లాటరీ ఫలితాలు వచ్చినప్పుడు నేను మా ఆఫీసులో ఉన్నాను. మొదట నా అన్నకు చెప్పాను. ఇద్దరం కలిసి నంబర్ పరిశీలించాము. టికెట్ బ్యాంకుకు ఇచ్చిన తర్వాతే విషయం బయటపెట్టాలని నిర్ణయించుకున్నాం. ఇంట్లో అందరూ ఆనందంగా ఉన్నారు. బహుమతి డబ్బును ఎలా వినియోగించాలో ఇంకా నిర్ణయించలేదు” అని చెప్పారు.
తన సమీప కుటుంబ సభ్యులు తప్ప ఈ విజయం గురించి ఎవరూ తెలియదని శరత్ తెలిపారు. ఓణం బంపర్ టికెట్‌ను తాను మొదటిసారి కొనుగోలు చేశానని తెలిపారు. ఇకపై కూడా లాటరీలు కొనుగోలు చేయాలని అనుకుంటున్నానని నవ్వుతూ అన్నారు. శరత్ తురవూరులో తన తల్లిదండ్రులు, అన్న, భార్య, కుమారుడితో కలిసి నివసిస్తున్నారు.
కేరళ రాష్ట్ర లాటరీ విభాగం నిర్వహించిన తిరువోణం బంపర్ 2025 (బీఆర్-105) డ్రా కార్యక్రమం శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు తిరువనంతపురంలోని గోర్కీ భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆర్థిక మంత్రి కె.ఎన్.బాలగోపాల్ ప్రారంభించారు. ఎమ్మెల్యేలు ఆంటోని రాజు, వి.ఎస్. ప్రసాంత్, లాటరీ విభాగ డైరెక్టర్ డాక్టర్ నితిన్ ప్రేమ్‌రాజ్ పాల్గొన్నారు.