Char Dham
Char Dham Yatra: భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే చార్ ధామ్ యాత్ర ప్రారంభమై నెల రోజులు అయింది. నిత్యం వేల సంఖ్యలో హిందువులు ఈ యాత్రకు వస్తున్నారు. హిమాలయాల్లో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్ మరియు బద్రీనాథ్..దేవాలయాల దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. కరోనా పరిస్థితుల వల్ల దాదాపు రెండేళ్ల అనంతరం ఈ ఏడాది మే 3న పూర్తి స్థాయిలో చార్ ధామ్ యాత్రను ప్రారంభించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. అయితే యాత్ర ప్రారంభమైన నెల రోజుల్లోనే 125 మంది భక్తులు మృతి చెందారు. సాధారణ యాత్ర సమయం (మే – అక్టోబర్)లో సంభవించే మరణాల సరాసరి (100 మరణాలు) కంటే ఇది 100 శాతం ఎక్కువని ఉత్తరాఖండ్ పర్యాటక మరియు ఆరోగ్యశాఖలు నివేదించాయి.
Other Stories: TTD: రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత సామూహిక వివాహాలు.. ఆగస్టు 7 సుముహూర్తం
దాదాపు రెండేళ్ల అనంతరం పూర్తిస్థాయిలో చార్ ధామ్ యాత్ర ప్రారంభం కావడంతో యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. అదే సమయంలో రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కరోనా ఆంక్షలను కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎత్తివేయడంతో సాధారణ పర్యాటకుల తాకిడి కూడా పెరిగింది. ఈక్రమంలో నిత్యం 55000 నుంచి 58000 మంది భక్తులు చార్ ధామ్ యాత్రకు తరలి వస్తున్నట్టు అధికారులు అంచనా వేశారు. కరోనాకు ముందు పరిస్థితుల సరాసరి సంఖ్య కంటే ఇది 14000 అధికంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. అయితే చార్ ధామ్ యాత్ర ప్రారంభమైన నెల రోజుల వ్యవధిలోనే 125 మంది భక్తులు మృతి చెందడంపట్ల ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తం అయింది.
Other Stories: Gyanvapi Mosque: ప్రతి మసీదులో శివలింగాన్ని ఎందుకు వెతుకుతున్నారు – ఆర్ఎస్ఎస్ చీఫ్
సీఎం పుష్కర్ సింగ్ ధామి స్వయంగా యాత్ర పై సమీక్షించి..ఇద్దరు కేబినెట్ మంత్రులను పర్యవేక్షణ నిమిత్తం నియమించారు. మరోవైపు చార్ ధామ్ యాత్రకు వచ్చి మృతి చెందిన 125 మంది భక్తుల్లో 75 మంది వృద్ధులు ఉన్నారని.. వారిలో 35 మహిళలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కరోనా అనంతర దుష్ప్రభావాలు, గుండె సమస్యలు, ఇతర దీర్ఘకాల అనారోగ్య కారణాల వలనే ఈ మరణాలు సంభవించినట్లు అధికారులు గుర్తించారు. ప్రకృతి విపత్తు కారణంగా ఎటువంటి మరణాలు సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు.
Other Stories: CAA: సీఏఏను కేరళలో అమలు చేయబోం – కేరళ సీఎం
దీంతో చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పలు మార్గదర్శకాలు జారీచేసింది. వయసు మళ్లిన వారు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న భక్తులు తమ వైద్య పరీక్షలకు సంబందించిన పత్రాలు సమర్పించాలని, కోవిడ్ భారిన పడి కోలుకున్న వారు, హృద్రోగ, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు..తమ వెంట ఆక్సిజన్ సీసాలను వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం..అత్యవసర వైద్య శిబిరాలను కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.