ఆలస్యమైనా న్యాయం : ఈబీసీ బిల్లుకి టీఆర్ఎస్ మద్దతు
అగ్రవర్ణ పేదల కోసం కేంద్రం తీసుకొచ్చిన రిజర్వేషన్ బిల్లుకు TRS మద్దతు ఇచ్చింది. లోక్‌సభలో ఈ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న TRS MP జితేందర్‌రెడ్డి.. EBC రిజర్వేషన్లను సమర్దించారు. విద్య, ఉద్యోగాల్లో EBCలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. అదే సమయంలో కొన్ని సవరణలు ప్రతిపాదించారు. కేంద్రం ముందు పలు డిమాండ్లు ఉంచారు. ఆలస్యమైనా అగ్రవర్ణ పేదలకు న్యాయం జరుగుతోందని అన్నారు. ఆర్థికంగా వెనకబడిన వారికి ఈ బిల్లుతో ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ఇప్పటివరకు ఉన్న ఏ ప్రభుత్వం సామాన్యుడి గురించి ఆలోచించలేదన్నారు. సమాజంలో వెనకబాటుతనానికి ప్రభుత్వాలే కారణం అని జితేందర్ రెడ్డి ఆరోపించారు.
రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్రాలకు బదలాయించాలని జితేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మైనారిటీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంచుతూ తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ప్రస్తావించారు. ముస్లింలకు 12 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోవడాన్ని తప్పుపట్టారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్రం అనుమతిస్తే రిజర్వేషన్ల పెంపు అసాధ్యం కాదన్నారు.