Live in Relationship : కోర్టు సంచలన తీర్పు… ‘వివాహమైన వ్యక్తి.. మరో యువతితో సహజీవనం చేయవచ్చు.. అదేం నేరం కాదు’
Live in Relationship : సహజీవనంపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహితుడైన వ్యక్తి మరో మహిళ అంగీకారంతో సహజీవనం చేయడం తప్పు కాదని పేర్కొంది.
Allahabad High Court Said Married man live in relationship with other adult woman is not a crime
Live in Relationship : అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వివాహితుడైన వ్యక్తి, మేజర్ అయిన యువతితో సహజీవనం చేయడం నేరం కాదని పేర్కొంది. ఇలాంటి ఘటనల్లో నైతికతను, చట్టాన్ని వేరుగా చూడాలని స్పష్టం చేసింది. వివాహం చేసుకున్న పురుషుడు, మరో వయోజన మహిళతో ఆమె అంగీకారంతో సహజీవనం చేస్తే.. అలాంటి బంధాన్ని చట్టం అడ్డుకోలేదని, అది నేరం కిందకు రాదని కోర్టు వివరించింది. ఉత్తరప్రదేశ్, షాజహాన్‌పూర్‌కు చెందిన ఒక జంట దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వివాహితుడు మరొక మహిళతో కలిసి ఉండటంపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయడమే కాకుండా, వారికి పూర్తి రక్షణ కల్పించాలని ఆదేశించింది.
అసలేం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్‌కు చెందిన అనామిక (18) అనే యువతి, నేత్రపాల్ అనే వ్యక్తిని ఇష్టపడింది. వీరిద్దరూ గత కొన్ని నెలలుగా సహజీవనంలో ఉన్నారు. అయితే నేత్రపాల్‌కు అప్పటికే వివాహం జరిగింది. దీనితో అనామిక తల్లి 2026 జనవరి 8న నేత్రపాల్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాహితుడైన నేత్రపాల్ తన కుమార్తెను మభ్యపెట్టి, కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ కేసును సవాలు చేస్తూ అనామిక జంట హైకోర్టును ఆశ్రయించింది. తమ కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరింది.
ఈ కేసు విచారణలో భాగంగా అనామిక తాను మేజర్ అని, తన సమ్మతితోనే నేత్రపాల్‌తో కలిసి ఉంటున్నానని కోర్టుకు స్పష్టం చేసింది. అనామిక కుటుంబం తరఫు లాయర్ వాదిస్తూ.. నేత్రపాల్ అప్పటికే వివాహితుడని, కాబట్టి అతను మరో మహిళతో కలిసి ఉండటం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.
ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టం, సామాజిక నైతికత రెండూ వేర్వేరని స్పష్టం చేసింది. సమాజం వీరి బంధాన్ని తప్పుగా చూడవచ్చు కానీ, చట్టం దృష్టిలో మేజర్లైన వీరిద్దరూ పరస్పర అంగీకారంతో కలిసి ఉండటం నేరం కాదని వివరించింది. దేశ పౌరుల హక్కులను రక్షించేటప్పుడు సామాజిక అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. నేత్రపాల్‌కు పెళ్లైనప్పటికీ, మేజర్ యువతి సమ్మతితో ఆమెతో కలిసి ఉండటం చట్టప్రకారం నేరం కాదని తేల్చి చెప్పింది.
“ఇద్దరు మేజర్లు కలిసి జీవించాలనుకోవడం వారి హక్కు. వారిని రక్షించడం పోలీసుల బాధ్యత. ఈ విషయంలో పోలీస్ సూపరింటెండెంట్‌కు ప్రత్యేక బాధ్యత ఉంది” అని కోర్టు తెలిపింది. అనామిక కుటుంబ సభ్యులు ఆ జంటకు ఎలాంటి హాని కలిగించకూడదని, వారి నివాసానికి వెళ్లకూడదని, నేరుగా గానీ లేదా ఎలక్ట్రానిక్ మార్గాల్లో గానీ వారిని సంప్రదించకూడదని కోర్టు ఆదేశించింది. షాజహాన్‌పూర్ పోలీస్ సూపరింటెండెంట్ ఆ జంట భద్రతకు పూర్తి బాధ్యత వహించాలని కోర్టు స్పష్టం చేసింది.
