America Visa
america visas to Indian students : కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సమయంలో కూడా అమెరికా వెళ్లే భారత విద్యార్థులకు రికార్డు స్థాయిలో వీసాలు మంజూరు చేసినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ తెలిపింది. ఈ ఏడాది దాదాపు 55,000లకు పైగా విద్యార్థులకు వీసా మంజూరు చేసినట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజు అనుమతి పొందుతున్న వీసాల్లో విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నాయని వెల్లడించారు.
అమెరికాలో ఉన్నత చదువు అనేది భారత విద్యార్థులకు ప్రత్యేక అనుభవమని అమెరికా దౌత్యవేత్త అతుల్ కేశవ్ అన్నారు. ప్రపంచ దృక్పథాన్ని అలవరచుకోవడంతో పాటు అమూల్యమైన ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. అలాగే ఇరు దేశాల మధ్య సంబంధాలను ఇవి మరింత బలోపేతం చేస్తాయన్నారు.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా వీసా ఇంటర్వ్యూ ప్రక్రియ 2 నెలల వాయిదా పడిందని చెప్పారు. మే నెలలో ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ జులైలో మొదలు పెట్టామని పేర్కొన్నారు.
విద్యార్థులకు సెమిస్టర్ నష్టం కలుగకుండా ఉండేందుకు వేగంగా వీసా మంజూరు ప్రక్రియ కొనసాగించమన్నారు.
కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలోనూ భారత విద్యార్థులకు ఇంతకముందు ఎన్నడూ లేని విధంగా వీసాలు మంజూరు చేశామని తెలిపారు. అందుకోసం అమెరికా విదేశాంగ శాఖ సిబ్బంది చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన ప్రసంశించారు. దీని వల్లే రికార్డు స్థాయిలో భారత విద్యార్థులకు వీసాలను మంజూరు చేశామని స్పష్టం చేశారు.