సీఏఏకి వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమత కేంద్రప్రభుత్వంపై ఫైట్ చేస్తున్న ప్రస్తుత సమయంలో మమత, ప్రధాని మోడీ ఒకే వేదికను పంచుకోనున్నారు అనే వార్త ఇప్పుడు ఆశక్తికరంగా మారింది. ఈ నెల 11, 12 తేదీల్లో మోడీ వెస్ట్ బెంగాల్‌లో పర్యటిస్తారు. ఆదివారం(జనవరి-12,2020)కోల్ కతా పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షికోత్సవాల సందర్భంగా కోల్ కతాలో ఓ భారీ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది. అయితే వీరిద్దరూ ఒకే వేదికపై కనిపిస్తారా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది. వెస్ట్ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధనకర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల పట్టిక, జాతీయ జనాభా పట్టిక వంటి అంశాలపై మమత బెనర్జీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఆమె తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీతో కలిసి వేదికను పంచుకునేందుకు మమత అంగీకరిస్తారా? అనే అంశం చర్చనీయాంశమైంది.
మోడీ, మమత ఒకే వేదికపై కనిపిస్తారా? అనే ప్రశ్నకు తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు కూడా సమాధానం చెప్పడం లేదు. మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా దీనిపై మాట్లాడటం లేదు. తమ పార్టీ అధినేత్రి పోర్టు ట్రస్ట్ వార్షికోత్సవాలకు హాజరవడంపై ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.