PM Narendra Modi
PM Narendra Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కాలంలో భారత దేశం ఉత్పత్తులపై టారిఫ్‌ల మోత మోగిస్తున్న విషయం తెలిసిందే. రష్యా నుంచి పెద్దమొత్తంలో చమురును కొనుగోలుచేస్తూ యుక్రెయిన్ పై దాడికి పరోక్షంగా భారత్ సహకరిస్తుందని ఆరోపణలు చేస్తున్న ట్రంప్.. భారత్ పై 50శాతం సుంకాలను మోపారు. దీనికితోడు ఆపరేషన్ సిందూర్‌ను తానే ఆపినట్లు పలుమార్లు ట్రంప్ బహిరంగ వేదికల్లో ప్రస్తావించారు. ఈ వాదనను భారత్ ఎన్నిసార్లు ఖండించినప్పటికీ ట్రంప్ తనతీరు మార్చుకోవటం లేదు. అయితే, ట్రంప్ టారిఫ్ ల విధింపు నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఎన్నడూ లేని స్థాయిలో సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
టారిఫ్‌ల వివాదం వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. మోదీ 75వ పుట్టిన రోజు సందర్భంగా ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘నా 75వ పుట్టినరోజు సందర్భంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినందుకు నా మిత్రుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ధన్యవాదాలు. మీలాగే, నేను కూడా భారతదేశం – అమెరికా సమగ్ర, ప్రపంచ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. యుక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం మీరు చేసే చొరవలకు మేము మద్దతు ఇస్తున్నాము.’’ అని మోదీ పేర్కొన్నారు.
Thank you, my friend, President Trump, for your phone call and warm greetings on my 75th birthday. Like you, I am also fully committed to taking the India-US Comprehensive and Global Partnership to new heights. We support your initiatives towards a peaceful resolution of the…
— Narendra Modi (@narendramodi) September 16, 2025
ఇదిలాఉంటే.. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు మళ్లీ మంగళవారం ప్రారంభమయ్యాయి. భారత్ తరపున వాణిజ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం ఈ చర్చల్లో పాల్గొనగా.. దక్షిణ, మధ్య ఆసియాకు అమెరికా నుంచి వాణిజ్య ప్రతినిధిగా వ్యవహరిస్తున్న బ్రెండెన్ లించ్ అమెరికా బృందానికి సారథ్యం వహిస్తున్నారు. గతంలో ఐదు విడతలుగా ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. తాజాగా ప్రారంభమైన చర్చలు సానుకూల పరిష్కారం చూపుతాయోమోనన్న ఆశాభావం ఎగుమతిదారుల్లో నెలకొంది.
భారత దేశం ఉత్పత్తులపై అమెరికా అదనంగా విధించిన 25శాతం సుంకాన్ని తొలగించకుంటే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉండవని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) అభిప్రాయ పడింది. అమెరికా నుంచి అదనపు సుంకాల తొలగింపు సంకేతాలు వచ్చే వరకు చర్చలు నెమ్మదిగానే కొనసాగుతాయని, వేగవంతం పరిష్కారం ఉండకపోవచ్చునని జీటీఆర్ఐ తెలిపింది.