Amul Milk: దేశ వ్యాప్తంగా రేట్లు పెంచేసిన అమూల్..
పలురకాలైన పాలను విక్రయిస్తోన్న అమూల్ బ్రాండ్.. ఇకపై రెండు రూపాయలు పెంచేయనుంది. జులై 1నుంచి దేశవ్యాప్తంగా ఈ ధరలు అమల్లోకి...

Amul Milk
Amul Milk: పలురకాలైన పాలను విక్రయిస్తోన్న అమూల్ బ్రాండ్.. ఇకపై రెండు రూపాయలు పెంచేయనుంది. జులై 1నుంచి దేశవ్యాప్తంగా ఈ ధరలు అమల్లోకి వస్తాయని గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఐఎమ్ఎమ్ఎఫ్) అధికారికంగా ప్రకటించింది. తాము ధరలు పెంచడానికి కారణం.. ఉత్పత్తి కోసం వెచ్చిస్తున్న పెట్టుబడి ఎక్కువగా ఉండటమే.
దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో తాజా పాలను అమ్ముతున్నామని మరోసారి గుర్తు చేసింది. ఈ ధరల పెంపు తర్వాత అర లీటర్.. అమూల్ గోల్డ్ పాలు- రూ.29, అమూల్ తారా రూ.23, అమూల్ శక్తి రూ.26గా పెరగనున్నాయి. 2రూపాయల ధర పెంచడమనేది ఎమ్మార్పీలో 4శాతం పెరగడంతో సమానమని జీసీఐఎమ్ఎమ్ఎఫ్ వెల్లడించింది.
సంవత్సరం ఐదు నెలల తర్వాతే పాల ధరలు పెంచినట్లు సంస్థ పేర్కొంది. పాల ఉత్పత్తి కోసం చేస్తున్న ఖర్చు పెరగడం, ట్రాన్స్‌పోర్టేషన్ ఛార్జీలు పెరగడం, ప్యాకేజింగ్, లాజిస్టిక్ లలో కూడా ఎక్కువ ఖర్చులు అవుతున్నట్లు స్పష్టం చేసింది.
కేవలం పాల ధరలే కాకుండా.. నూనె, టీ, సబ్బుల ధరలు, ప్యాక్ చేసిన ఆహార ధాన్యాల ధరలు కూడా పెరిగిపోయాయి. అందుకే ఫ్రెష్ మిల్క్ క్యాటగిరీలో మార్పులు చేసి ధరలు పెంచుతున్నట్లు ప్రకటిస్తున్నామని జీసీఐఎమ్ఎమ్ఎఫ్ చెప్పింది.