Anil Deshmukh : మహారాష్ట్రలో రేపే పోలింగ్.. మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పై రాళ్ల దాడి.. సుప్రియా సూలే ఫైర్

ఘటన జరిగినప్పుడు దేశ్‌ముఖ్‌తోపాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు ఉజ్వల్ భోయర్ కారులో ఉన్నారు. డ్రైవర్ పక్క సీట్లో అనిల్ దేశ్‌ముఖ్‌ కూర్చున్నాడు.

Anil Deshmukh

Attack On Anil Deshmukh : మహారాష్ట్రలో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక దశలో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) పార్టీ నాయుడు, మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కారుపై సోమవారం రాత్రి సమయంలో రాళ్లదాడి జరిగింది. ఆయన కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో అనిల్ దేశ్‌ముఖ్ కు తీవ్ర గాయాలయ్యాయి. తలకు బలమైన గాయం కావడంతో ఆయన హుటాహుటాన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు బలగాలు అప్రమత్తమయ్యాయి.

Also Read: మహారాష్ట్రలో ఓటర్ల మనసు గెలిచేది ఎవరు? అధికారంలో నిలిచేది ఎవరు?

ఘటన జరిగినప్పుడు దేశ్‌ముఖ్‌తోపాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు ఉజ్వల్ భోయర్ కారులో ఉన్నారు. డ్రైవర్ పక్క సీట్లో అనిల్ దేశ్‌ముఖ్‌ కూర్చున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు కారు ముందు అద్దంపై పెద్దరాయి విసిరారు. దీంతో కారు గ్లాస్ పలిగిపోయి.. ఆ తరువాత నేరుగా దేశ్‌ముఖ్‌ నుదుటిపై రాయి తాకింది. ఆ సమయంలో దాడి చేసిన వారు ‘బీజేపీ జిందాబాద్’ అని నినాదాలు చేసినట్లు, ఆ వెంటనే మోటార్ సైనిల్ పై నిందితులు పరారయ్యారని ఉజ్వల్ భోయర్ పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనను మహావికాస్ అఘాడీ కూటమి తీవ్రంగా ఖండించింది.

Also Read: PM Modi : బ్రెజిల్ వేదికగా జీ20 సదస్సు.. ప్రపంచ దేశాధినేతలతో ప్రధాని మోదీ వరుస భేటీలు

దేశ్‌ముఖ్‌ పై దాడి ఘటనను ఎన్సీపీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే తీవ్రంగా ఖండించారు. ప్రచారం ముగించుకొని తిరిగి వెళ్తుండగా అనిల్ దేశ్‌ముఖ్‌ పై కొందరు వ్యక్తులు దాడి చేశారని, ఇదిచాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఈ దాడిని మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల సమయంలో ఈ విధంగా దాడిచేసే మనస్తత్వం రాష్ట్రంలో ఎప్పుడూ లేదని అన్నారు. ఈ ఘటనపై శరద్ పవార్ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ దాడి ఘటనలో బీజేపీ నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష పార్టీల నేతల ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. ఇదో ఎన్నికల స్టంట్ అంటూ బీజేపీ నేతలు పేర్కొన్నారు. దేశ్‌ముఖ్‌ పై వాళ్ల సొంత కార్యకర్తలే రాళ్లతో కొట్టారని, కేవలం ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఇదొక డ్రామా అని పలువురు బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని, దాడికి పాల్పడిన వారిని గుర్తించడానికి చర్యలు చేపట్టినట్లు నాగ్‌పూర్‌ రూరల్ ఎస్పీ వెల్లడించారు. అనిల్ దేశ్‌ముఖ్‌ గతంలో రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పనిచేశారు. రూ. కోట్లలో లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు రావడంతో మంత్రివర్గం నుంచి వైదొలిగారు. ఆయన కుమారుడు సలీల్ దేశ్‌ముఖ్‌ ప్రస్తుతం కటోల్ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ (శరద్ పవార్) ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సోమవారంతో ఎన్నికల ప్రచారం ముగియడంతో అనిల్ దేశ్‌ముఖ్‌ ప్రచారం ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.