ఆందోళనలు.. సీఎం ఆదేశాలు.. ఆ ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఆపేశారు

  • Publish Date - December 27, 2019 / 04:46 AM IST

పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు పెరిగిపోయిన క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ(27 డిసెంబర్ 2019) శుక్రవారం ముస్లింల ప్రార్థనలు చేసే సమయం కావడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీని నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. నిరసనలను పర్యవేక్షించేందుకు డ్రోన్‌లను రంగంలోకి దింపింది.

రాష్ట్రంలో ఎక్కడా కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకూడదని పోలీసులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి. ఈ క్రమంలోనే పశ్చిమ యూపీలోని బిజ్నోర్‌, బులంద్‌ షహర్‌, ముజఫర్‌నగర్‌, మీరట్‌, ఆగ్రా, ఫిరోజాబాద్‌, సంభల్‌, అలీగఢ్‌, ఘజియాబాద్‌, రాంపూర్‌, సీతాపూర్‌, కాన్పూర్‌ జిల్లాల్లో ఇంటర్‌నెట్‌ను అధికారులు నిలిపివేశారు. కాగా ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న రాష్ట్ర రాజధాని లక్నోలో​ మాత్రం ఈ దిశగా చర్యలు చేపట్టలేదు.

ఆగ్రాలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఇంటర్‌నెట్‌ను నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. బులద్‌షహర్‌లో కూడా ఇంటర్‌నెట్‌ సేవలను శనివారం(28 డిసెంబర్ 2019) పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. సోషల్‌ మీడియా కంటెంట్‌ను సైతం పరిశీలిస్తామని స్పష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పెంచడంతో పాటు నిరసనలపై పర్యవేక్షణ చేస్తున్నారు. 

ట్రెండింగ్ వార్తలు