Richest CM: దేశంలోనే రిచ్చెస్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు.. అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రి ఎవరంటే?

దేశంలో అత్యధిక సంపద కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో తొలి మూడు స్థానాల్లో చంద్రబాబు నాయుడు, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ, కర్ణాటక సీఎం సిద్దరామయ్య నిలిచారు.

Chandrababu Naidu, Pema Khandu and Siddaramaiah

Chandrababu Naidu: దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల జాబితాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) సంయుక్తంగా విడుదల చేశాయి. ముఖ్యమంత్రుల అఫిడవిట్ల ఆధారంగా జాబితాను రూపొందించాయి. ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ, కర్ణాటక సీఎం సిద్దరామయ్య నిలిచారు. నివేదిక ప్రకారం.. చంద్రబాబు నాయుడు ఆస్తులు రూ. 931 కోట్లు కాగా.. పేమా ఖండూ ఆస్తులు రూ.332 కోట్లు. అదేవిధంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆస్తుల విలువ రూ. 51 కోట్లుగా నివేదిక పేర్కొంది. ఈ రెండు సంస్థలు కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకొని ప్రస్తుతం అధికారంలో ఉన్న 31మంది ముఖ్యమంత్రుల ఆస్తులు, కేసుల వివరాల జాబితాను విడుల చేయగా.. 31మంది ముఖ్యమంత్రుల ఆస్తులు రూ.1,630 కోట్లుగా నివేదిక పేర్కొంది.

 

2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలో వార్షిక తలసరి ఆదాయం రూ. 1.85లక్షలు కాగా.. ఒక ముఖ్యమంత్రి తలసరి ఆదాయం రూ.13.64లక్షలుగా నివేదిక పేర్కొంది. అంటే.. దేశంలో వార్షిక తలసరి సగటు కంటే సీఎం ఆదాయం 7.3రెట్లు అధికంగా ఉన్నట్లు ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది. ఇదిలాఉంటే.. చంద్రబాబు నాయుడు కుటుంబం ఆస్తులు రూ. 931 కోట్లు ఉండగా.. అప్పు రూ.10కోట్లు ఉంది. చంద్రబాబు పేరిట రూ.36కోట్ల ఆస్తులుండగా, ఆయన సతీమణి భువనేశ్వరి పేరట రూ.895 కోట్ల ఆస్తులున్నాయి. ఇందులో హెరిటేజ్ ఫుడ్స్ లో ఉన్న షేర్లనూ కలిపి నివేదిక లెక్కించింది.

Also Read: Tirumala : తిరుమల శ్రీవారి దర్శనాలపై సీఎం రేవంత్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ..

దేశంలో తక్కువ సంపద కలిగిన ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు. ఆమె ఆస్తుల విలువ రూ.15లక్షలు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్తులు రూ. 30 కోట్లకుపైగానే ఉన్నాయి. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేరిట రూ. 55లక్షలు, కేరళ ముఖ్యమంత్రి పినరయీ విజయన్ పేరిట రూ.1.18కోట్ల ఆస్తులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

Also Read: PDS Rice Case : రేషన్ బియ్యం కేసు.. పేర్ని నాని భార్యకు ఊరట..

నివేదిక ప్రకారం.. ముఖ్యమంత్రుల్లో 13మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. పది మంది ముఖ్యమంత్రిపై హత్య, అపహరణ, ముడపులు వంటి అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. అత్యధిక క్రిమినల్ కేసులున్న ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిలిచారు. ఆయనపై 89 కేసులు పెండింగ్ లో ఉండగా.. వాటిలో 72 కేసులు తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులుగా నివేదిక పేర్కొంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 47 కేసులు ఉండగా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పై 19 కేసులు ఉన్నాయి.

Also Read: Free Bus Ride Scheme : మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం..!

31మంది ముఖ్యమంత్రుల్లో తొమ్మిది మంది పోస్టు గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇద్దరు డాక్టరేట్ పొందారు. మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అతిశీ మహిళా ముఖ్యమంత్రులు. డజను మంది సీఎంలు 51-60 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు కాగా.. ఆరుగురు ముఖ్యమంత్రులు 71ఏళ్లు పైబడిన వారు. 40సంవత్సరాలోపు వయస్సు కలిగిన సీఎం ఒక్కరు మాత్రమే ఉన్నారు.