PDS Rice Case : రేషన్ బియ్యం కేసు.. పేర్ని నాని భార్యకు ఊరట..
జాయింట్ కలెక్టర్ ఇచ్చిన నోటీసును రద్దు చేయాలని మోషన్ పిటిషన్ వేశారు.

PDS Rice Case : రేషన్ బియ్యం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధకు ఊరట లభించింది. జయసుధకు కృష్ణా జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు రేషన్ బియ్యం మాయం కేసులో జయసుధకు జాయింట్ కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. మరో కోటి 67 లక్షల రూపాయలు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే కోటి 79 లక్షల రూపాయలు పైన్ కట్టించారు. జాయింట్ కలెక్టర్ ఇచ్చిన నోటీసుపై హైకోర్టును ఆశ్రయించారు పేర్ని నాని. జాయింట్ కలెక్టర్ ఇచ్చిన నోటీసును రద్దు చేయాలని మోషన్ పిటిషన్ వేశారు.
రేషన్ బియ్యం స్కామ్ లో జయసుధపై కేసు..
మాజీ మంత్రి పేర్నినాని భార్య జయసుధకు మచిలీపట్నం కోర్టులో రిలీఫ్ లభించింది. రేషన్ బియ్యం స్కామ్ లో జయసుధపై కేసు నమోదైంది. ఈ కేసులో జయసుధను అరెస్ట్ చేసేందుకు పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో జయసుధ మచిలీపట్నం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె చెబుతున్నారు.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు మూడుసార్లు వాయిదాలు వేసింది. చివరికి కోర్టులో ఊరట లభించింది. అయితే, పోలీసుల విచారణకు హాజరు కావాలని, పోలీసులకు సహకరించాలని మచిలీపట్నం కోర్టు చెప్పింది. పోలీసులు ఎప్పుడు పిలిచినా తన క్లెయింట్ జయసుధ విచారణకు వెళ్తారని కోర్టుకు తెలిపారు జయసుధ తరపు న్యాయవాది.
మరో కోటి 70 లక్షలు చెల్లించాలని నోటీసులు..
ఇదిలా ఉండగా మచిలీపట్నం జాయింట్ కలెక్టర్ మరోసారి జయసుధకు నోటీసులు ఇచ్చారు. రేషన్ బియ్యం స్కామ్ లో కోటి 70 లక్షల రూపాయల చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై పేర్నినాని హైకోర్టును ఆశ్రయించారు. రేషన్ బియ్యం మాయం స్కామ్ కు సంబంధించి గోడౌన్ మేనేజర్ మానస తేజను పోలీసులు విచారిస్తున్నారు. సివిల్ సప్లయ్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డిని కూడా పోలీసులు విచారించారు.
గోడౌన్ లోనే బియ్యం మాయం అయ్యాయి అంటూ తొలుత ఫిర్యాదు చేసింది ఆయనే. అయితే, తాను తప్పించుకోవడానికే కోటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దాని ఆధారంగా గోడౌన్ మేనేజర్ మానస తేజ, సివిల్ సప్లయ్స్ అసిస్టెంట్ మేనేజర్ ను పోలీసులు విచారిస్తున్నారు. బియ్యం ఎలా మాయం అయ్యాయి? ఎవరు తీసుకెళ్లారు? మీరు ఎప్పుడు గమనించారు? అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
Also Read : జగన్ టార్గెట్‌గా పవన్ దూకుడు.. రాయలసీమపైనే ఫోకస్..! రాయలసీమలో క్యాంప్ ఆఫీస్ పెట్టబోతున్నారా?