Tirumala : తిరుమల శ్రీవారి దర్శనాలపై సీఎం రేవంత్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ..

శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

Tirumala : తిరుమల శ్రీవారి దర్శనాలపై సీఎం రేవంత్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ..

Updated On : December 31, 2024 / 12:33 AM IST

Tirumala : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై తిరుమల శ్రీవారి దర్శనాల కేటాయింపుపై అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలనే ప్రతిపాదనను పరిశీలించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలుగు జాతి సత్సంబంధాల కోసం అనుమతులు మంజూరుకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రతి గౌరవ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతి వారము ఏదైనా రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు. మరో 2 రోజులు రూ.300 టిక్కెట్లు అనుమతిస్తామన్నారు. ప్రతీ టిక్కెట్ పై ఆరుగురు భక్తులు దర్శనం చేసుకోవచ్చని వెల్లడించారు. సోమవారం నుంచి గురువారం మధ్య ఈ లేఖలకు అనుమతి ఉంటుందని సీఎం రేవంత్ కు రాసిన లేఖలో స్పష్టం చేశారు చంద్రబాబు.

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. తిరుమలలో తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు మంత్రులు సైతం కొంత కాలంగా ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. తమ సిఫార్సు లేఖలను అనుమతించాలని కోరుతూ ప్రతిపాదనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆ అంశంపై చర్చించారు. ఏ విధంగా అమలు చేయాలి అనేదానిపై ముఖ్యమంత్రితో డిస్కస్ చేశారాయన.

Also Read : నెల్లూరు పాలిటిక్స్‌లో కాకాణి వర్సెస్ సోమిరెడ్డి