కశ్మీర్ అల్లుడు అరుణ్ జైట్లీ ఇకలేరు

  • Publish Date - August 24, 2019 / 07:42 AM IST

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం (ఆగస్ట్ 24, 2019)న ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. ఈ విషయాన్ని ఎయిమ్స్ వర్గాలు ప్రకటించాయి. కొద్దిరోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే.  

అరుణ్ జైట్లీ 1982లో కాంగ్రెస్ సీనియర్ నేత గిరిధారీ డోగ్రా కుమార్తె సంగీతా డోగ్రాను వివాహమాడారు. జైట్లీ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారిద్దరు కూడా న్యాయవాద వృత్తిలోనే ఉన్నారు. ఆయనకు పుస్తకాలు చదవటం అంటే చాలా ఇష్టం. అలాగే న్యాయపరమైన అంశాలు, వర్తమాన వ్యవహారాల పై తాను రాసిన వ్యాసాలు, వివిధ వేదికలపై చేసిన స్పీచ్ లను కలపి ఓ పుస్తకం వెలువరించారు.

ఇక అరుణ్ జైట్లీ 1952, నవంబర్ 28న ఢిల్లీలో జన్మించారు. ఈయన తండ్రి ప్రముఖ న్యాయవాది. ఢిల్లీ నుంచి డిగ్రీ, న్యాయశాస్త్ర పట్టా పొందారు. ఢిల్లీ విశ్వ విద్యాలయంలో అభ్యసిస్తున్న సమయంలో విద్యార్థి సంఘం నాయకుడిగా కొనసాగారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఉన్న ఈయన 19 నెలలు జైలుకు వెళ్లి వచ్చారు. 1991 నుంచి బీజేపీ కార్యవర్గంలో పని చేశారు.