Assam Floods
Assam Floods : ఈశాన్య రాష్ట్రం అస్సాంలో వరదల బీభత్సం కొనసాగుతుంది. నదులు ఉప్పొంగుతున్నాయి. బ్రహ్మపుత్ర నది.. దాని ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అస్సాంలోని 30 జిల్లాల్లో భారీ వరదల కారణంగా 24లక్షల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 70 మంది మరణించారు. వందకుపైగా వణ్యప్రాణులు మృతిచెందగా.. 15.50లక్షల ప్రాణులపై వరద ప్రభావం పడింది. వరదలతో 125 రోడ్లు దెబ్బతినగా.. పలు వంతెనలుసైతం దెబ్బతిన్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ టీం సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 577 సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి..55వేల మందిని శిబిరాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు, ఆహారాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తుంది.
Also Read : CM Revanth Reddy : రేపు ఏపీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?
ఏకదాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలో నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. వరదలతో పంట పొలాలు దెబ్బతిన్నాయి. 70వేల హెక్టార్లలో పంటభూమి నీట మునిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఎరియల్ సర్వే నిర్వహించారు. వరద పరిస్థితిపై అస్సాం సీఎంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. వరద తలెత్తిన ఇబ్బందులు, ఏఏ రంగాలకు ఎంతమేర నష్టం వాటిల్లింది అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని అమిత్ షా అస్సాం ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. అస్సాంలో వరదల బీభత్సంపై లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు. అస్సాం రాష్ట్రంకు కేంద్రం వెంటనే వరద సహాయం అందించాలని కోరారు.
Also Read : నాసా హెచ్చరిక.. భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏం జరగనుందంటే?