BSF Jawan Released: బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ ను భారత్ కు అప్పగించింది పాకిస్తాన్. పాక్ రేంజర్లు గత నెల ఫిరోజ్ పూర్ వద్ద అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం సాహును ఎట్టకేలకు విడుదల చేశారు. నేటి ఉదయం పంజాబ్ లో అటారీ సరిహద్దు వద్ద మన దళాలకు అప్పగించారు. దీంతో పూర్ణ కుమార్ కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు భారత్ కి పట్టుబడ్డ పాకిస్తాన్ రేంజర్ ని భారత్ విడిచిపెట్టింది.
బీఎస్ఎఫ్ 182 బెటాలియన్ జవాన్ పూర్ణ కుమార్ ఫిరోజ్ పూర్ సెక్టార్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 23న సరిహద్దు వద్ద కొంతమంది రైతులకు రక్షణగా గస్తీ కాస్తుండగా ఆయన కాస్త అస్వస్థతకు గురయ్యారు. సమీపంలో ఓ చెట్టు కనిపించడంతో దాని కింద విశ్రాంతి తీసుకున్నారు. అయితే, అది పాక్ భూభాగం అన్న విషయాన్ని ఆయన గుర్తించలేకపోయారు. సరిహద్దు దాటి రావడంతో పాక్ రేంజర్లు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు.
జవాన్ విడుదల కోసం రెండు దేశాల భద్రతా దళాలు చర్చలు జరిపాయి. మరోవైపు పూర్ణం కుటుంబసభ్యులు తీవ్రంగా ఆందోళన చెందారు. గర్భిణి అయిన ఆయన భార్య తన భర్త విడుదల కోసం కేంద్రాన్ని వేడుకున్నారు. కొన్నాళ్ల పాటు భారత్ అధికారుల అభ్యర్థనలు పట్టించుకోకుండా పాక్ రేంజర్లు కాలయాపన చేశారు. పై అధికారుల నుంచి ఆదేశాలు రాలేదంటూ జాప్యం చేశారు.
మే నెల మొదటి వారంలో భారత దళాలు కూడా పాక్ రేంజర్ ను అదుపులోకి తీసుకున్నాయి. రాజస్తాన్ లోని శ్రీగంగా నగర్ సమీపంలో ఉన్న భారత్ పాక్ సరిహద్దుల్లోకి ఓ పాక్ రేంజర్ చొరబడ్డాడు. అనుమానాస్పదంగా తచ్చాడుతూ ఉండటంతో బీఎస్ఎఫ్ జవాన్లు అతడిని పట్టుకున్నారు. దీంతో వారిపై కూడా ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే పూర్ణంను అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
”బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ పూర్ణమ్ కుమార్ సాహును గత నెల 23న పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. 21 రోజుల పాటు పాక్ కస్టడీలో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ ను ఎట్టకేలకు పాక్ రేంజర్లు ఇవాళ(మే 14) విడిచిపెట్టారు. బుధవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు బీఎస్ఎఫ్ జవాన్ ని భారత్ కు అప్పగించారు. పంజాబ్ అమృత్ సర్ లోని అటారీ బోర్డర్ లో ఆయనను విడిచిపెట్టారు. జవాన్ అప్పగింత ప్రక్రియ శాంతియుతంగా, ప్రోటోకాల్స్ ప్రకారం జరిగింది” అని బీఎస్ఎఫ్ ప్రకటించింది. పాకిస్తాన్ రేంజర్స్‌తో క్రమం తప్పకుండా ఫ్లాగ్ సమావేశాలు, ఇతర కమ్యూనికేషన్ మార్గాల ద్వారా BSF నిరంతర ప్రయత్నాల ఫలితంగా జవాన్ ను స్వదేశానికి తిరిగి పంపడం సాధ్యమైందని BSF స్పష్టం చేసింది.
ఫిరోజ్‌పూర్‌లోని BSF 24వ బెటాలియన్‌లో పోస్ట్ చేయబడిన పూర్ణమ్ కుమార్, పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన ఒక రోజు తర్వాత, అంటే ఏప్రిల్ 23న ఇండో-పాక్ సరిహద్దులో మోహరించబడ్డాడు. స్థానిక రైతులకు గస్తీగా ఉన్న సమయంలో అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దును దాటాడని ఆరోపణలు ఉన్నాయి. వెంటనే ఆయనను పాకిస్తాన్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ తర్వాత కళ్ళకు గంతలు కట్టి ఉన్న జవాన్ ఫోటోను పాక్ విడుదల చేసింది.