auto driver honesty: రోడ్డు మీద రూపాయి కనపడినా వదలని జనాలు ఉన్న రోజులు ఇవి. వెంటనే తీసుకుని జేబులో వేసుకుని వెళ్లిపోయే రకాలు ఉన్నారు. అలాంటి ఈ రోజుల్లోనూ పరుల సొమ్ము ఆశించని నిజాయితీపరులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఓ ఆటో డ్రైవర్ నిలువెత్తు నిజాయితీకి నిదర్శనంగా నిలిచాడు. ప్రయాణికుడు తన ఆటోలో మర్చిపోయిన రూ.2లక్షల డబ్బు బ్యాగును తిరిగి అప్పజెప్పి శభాష్ అనిపించుకున్నాడు.
పోలీసులతో పాటు డబ్బు పోగొట్టుకున్న ప్రయాణికుడు మనసు గెలుచుకున్నాడు. పేదరికంలో మగ్గుతున్నా, ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా అతడు నిజాయితీగా వ్యవహరించి అందరి మనసులు గెలుచుకున్నాడు.
తమిళనాడు రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. అతడి పేరు మురుగన్. తిరునల్వేలిలో ఆటో డ్రైవర్. మురుగన్ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమాని కూడా. స్నేహితులు అతడిని రజనీ మురుగున్ అని పిలుస్తారు. మురుగన్ తన ఆటోలో కొన్ని రోజుల క్రితం ఓ బ్యాగ్ ని చూశాడు. తన ఆటోలో ప్రయాణించిన వారు ఎవరో మర్చిపోయారు. ఆ బ్యాగ్ ని తెరిచి చూడగా అందులో ఏకంగా రూ.2లక్షల డబ్బు ఉంది.
అయితే మురుగన్ లో ఎలాంటి ఆశ కలగలేదు. ఆ డబ్బుని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. పోలీసులకు విషయం చెప్పాడు. పోలీసులు డబ్బు బ్యాగ్ మర్చిపోయిన ప్రయాణికుడిని గుర్తించి స్టేషన్ కు పిలిపించారు. మురుగన్ సమక్షంలో రూ.2లక్షల డబ్బుని ఇచ్చారు. పోయిన డబ్బు తిరిగి తన చేతికి రావడంతో ఆ వ్యక్తి ఆనందంతో మురిసిపోయాడు. మురుగన్ నిజాయితీని మెచ్చుకున్నాడు. మురుగన్ కు కృతజ్ఞతలు తెలిపాడు. పోలీసులు సైతం ఆటో డ్రైవర్ నిజాయితీని ప్రశంసించారు. మురుగున్ నిజాయితీని అభినందిస్తూ పోలీసుల మురుగన్ దంపతులకు కొంత నగదుని ప్రోత్సాహకంగా ఇచ్చారు.
వాస్తవానికి మురుగన్ ది పేద కుటుంబం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అంతేకాదు అతడి కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పేదరికం వెంటాడుతున్నా, ఇబ్బందుల్లో ఉన్నా మురుగన్ దారి తప్పలేదు. ఎంతో నిజాయితీగా వ్యవహరించాడు. తన అవసరాలకు ఆ డబ్బు ఉపయోగపడుతుందని తెలిసినా, ముట్టుకోలేదు. డబ్బుని తిరిగి దాని యజమానికి అప్పగించాడు.
ఇప్పుడు మురుగన్ హీరో అయిపోయాడు. మురుగన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అంటూ పొగుడుతున్నారు. ఈ రోజుల్లోనూ నీలాంటి వ్యక్తులు ఉన్నారంటే ధర్మం ఇంకా బతికే ఉందని కామెంట్ చేస్తున్నారు. కాగా, బాషా సినిమాలో ఆటో డ్రైవర్ గా నటించిన రజనీకాంత్.. తమ ఆటో డ్రైవర్లందరికి స్ఫూర్తి అని మురుగన్ చెప్పాడు.