menstrual cups
ఆధునిక కాలంలో మహిళలు మెన్‌స్ట్రువల్ కప్‌లను వాడడం సాధారణం అయిపోయింది. టాంపోన్లు, శానిటరీ ప్యాడ్‌లకు ప్రత్యామ్నాయంగా పర్యావరణ అనుకూలమైన మెన్‌స్ట్రువల్ కప్‌లను వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాటిని వాడుతున్న మహిళ సంఖ్య భారీగా పెరుగుతోంది.
అయితే, వైద్య నిపుణులు వాటి వాడకంపై ఓ హెచ్చరిక చేస్తున్నారు. మెన్‌స్ట్రువల్ కప్‌ను సరైన రీతిలో ప్లేస్ చేయకపోతే లీకేజీ మాత్రమే కాకుండా కిడ్నీల సమస్యలు వంటి తీవ్రమైన ఇబ్బందులకు దారితీస్తుందని కొత్త అధ్యయనంలో వెల్లడైంది.
ఏమైంది?
పరిశోధనల్లో ఏం తేలిందో, అవి ఎంత హానికరమో నిపుణులు తెలిపారు. బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ మహిళ మెన్‌స్ట్రువల్ కప్‌ను సరిగ్గా పెట్టుకోకపోవడం వల్ల ఆమెకు యురేటోహైడ్రోనెఫ్రోసిస్ వచ్చింది. ఆ మహిళకు మెన్‌స్ట్రువల్ కప్ వల్ల ఎలా హాని జరిగిందో వివరించారు.
యురేటర్‌హైడ్రోనెఫ్రోసిస్ అనేది మూత్ర మార్గంలో అడ్డంకి కారణంగా తలెత్తే యురేటర్స్, కిడ్నీలు విడిపోయే పరిస్థితి ఏర్పడడం. మెన్‌స్ట్రువల్ కప్‌ను సరైన క్రమంలో పెట్టుకోకపోవడం వల్ల ఆ మహిళకు ఇదే పరిస్థితి తలెత్తింది. ఆ మహిళ(30) మొదట కడుపులో నొప్పితో బాధపడింది. మూత్రాశయంలోకి మూత్ర ప్రవాహంలో ఏర్పడిన అవరోధం వల్ల మూత్రపిండాల వాపు వచ్చింది.
దాదాపు ఆరు నెలలు ఆమె మూత్రంలో రక్తం చేరింది. దీంతో ఆమె వైద్యుల వద్దకు వెళ్లింది. ఆమెకు స్కానింగ్ వంటి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆమె కుడి మూత్రపిండాలు, యురేటర్ (మూత్రపిండాల నుంచి మూత్రాన్ని తీసుకువెళ్లే గొట్టం) ఉబ్బాయని గుర్తించారు. ఆ మహిళ మెన్‌స్ట్రువల్ కప్ పెట్టిన తీరు సరికాదని, అది మూత్రాశయంలోకి యురేటర్ తెరుచుకునే ప్లేస్ పక్కన ఉందని చెప్పారు.
దీంతో ఆమెకు నెలరోజుల పాటు ఆ కప్ ధరించవద్దని, తదుపరి వైద్య పరీక్షల కోసం మళ్లీ రావాలని చెప్పారు. ఆమె తన రెండవ రౌండ్ పరీక్షల కోసం తిరిగి వచ్చినప్పుడు, వాపు తగ్గింది. ఆమెలో నొప్పి కూడా లేకుండా పోయింది. ఆమె కిడ్నీ పనితీరు సాధారణమైనది. ఆమె మెన్‌స్ట్రువల్ కప్‌ను సరిగ్గా వాడకపోవడం వల్లే ఆమెకు సమస్యలు తలెత్తాయని వైద్యులు నిర్ధారించారు.
మెన్‌స్ట్రువల్ కప్‌లను సిలికాన్ నుంచి తయారుచేస్తారు. ఈ కప్పులను పునర్వినియోగించుకోవచ్చు కాబట్టి వాటిని చాలా మంది వాడుతున్నారు. వాటిని దాదాపు 12 గంటల వరకు ఉపయోగించవచ్చు. కానీ, అవి సురక్షితమేనా? లాన్సెట్ పబ్లిక్ హెల్త్‌లో ఇదే విషయాన్ని ప్రచురించారు.
ఇతర శానిటరీ ఉత్పత్తులలాగే మెన్‌స్ట్రువల్ కప్‌లు కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయని కనుగొన్నారు. పేద దేశాలలో ఈ కప్లు మరింత ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. వీటి వాడకంతో అనారోగ్యం ఏమీ సంభవించదని చెప్పారు. అయితే, వాటిని సరైన రీతిలో ఉపయోగించాలని ప్రస్తుతం వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఎలా వాడాలి?
ఇటీవల 530 మంది యువతులపై ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. చాలామంది అమ్మాయిలు తొలిసారి మెన్‌స్ట్రువల్ కప్‌లను వాడినప్పుడు ఆ కప్పును తొలగించడం చాలా కష్టమని భావించారు. కాబట్టి, దానిని ఎలా ధరించాలి అన్న విషయంపై అవగాహన ఉండడం ముఖ్యం.
మెన్‌స్ట్రువల్ కప్ పెట్టుకునేటప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. మెన్‌స్ట్రువల్ కప్‌ను ఫోల్డ్ చేసి, దానిని చొప్పించి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఆ కప్పు పూర్తిగా తెరుచుకుందా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించుకోండి. దాన్ని మెల్లిగా మెలితిప్పి, సర్దుబాటు చేసుకోవచ్చు. తొలగింపులో సమయంలో బలంగా లాగవద్దు. కప్పు అడుగు భాగాన్ని తిప్పి తీయాలి.