Lawrence Bishnoi reveals names on hit-list network ( Image Source : Google )
Baba Siddique Murder : మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసిన హిట్ లిస్టు బయటకు వచ్చింది. బిష్ణోయ్ హిట్ లిస్ట్‌లో అనేక మంది పేర్లు వెల్లడయ్యాయి. గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఖైదు అయిన గ్యాంగ్‌స్టర్ తాను హిట్‌లిస్ట్ సిద్ధం చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కి తెలిపాడు.
ఎన్ఐఏ ప్రకారం.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ లారెన్స్ బిష్ణోయ్ ప్రధాన లక్ష్యంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాబా సిద్ధిఖీ సల్మాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడు.. అందుకే ముందుగా ఆయన్ను బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. బాబా సిద్ధిఖీ కుమారుడు అయిన జీషాన్ కూడా బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్టులో ఉన్నట్టు సమాచారం. సల్మాన్ ఖాన్, జీషాన్ సహా పలువురి పేర్లు కూడా బిష్ణోయ్ హిట్ లిస్టులో ఉన్నట్టుగా నివేదిక వెల్లడించింది.
1998లో కృష్ణజింకను చంపిన కేసులో సల్మాన్ ఖాన్ కూడా ఒకరు. అప్పటినుంచి సల్మాన్‌ను బిష్ణోయ్ టార్గెట్ చేశాడు. ఈ జంతువును బిష్ణోయ్ కమ్యూనిటీ పవిత్రమైనదిగా భావిస్తుంది. అందుకే సల్మాన్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టు గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ ఎన్ఐఏకు వెల్లడించాడు. అప్పట్లోనే బిష్ణోయ్.. ముంబైలోని సల్మాన్ ఇంటి వద్ద రెక్కీ చేసేందుకు సంపత్ నెహ్రా అనే గ్యాంగ్‌స్టర్‌ని పంపాడు. అయితే, నెహ్రాను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆ ప్లాన్ కుదరలేదు.
ఈ ఏడాది ప్రారంభంలో సల్మాన్ ఇంటి వెలుపల గ్యాంగ్ కాల్పులు జరిపింది. ఈ కేసులో ఇద్దరిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో సల్మాన్ ప్రాణాలకు ముప్పు ఉందనే ఉద్దేశంతో ఆయనకు ప్రభుత్వం భద్రతను పెంచింది. అప్పటికే గాయకుడు సిద్ధూ మూస్ వాలాను ఈ ముఠా హత్య చేసింది. బిష్ణోయ్‌కి సన్నిహితుడైన విక్కీ మిద్దుఖేరా హంతకులకు ఆశ్రయం కల్పించినందుకు గాయకుడి మేనేజర్ షగన్‌ప్రీత్ సింగ్ కూడా హిట్ లిస్ట్‌లో ఉన్నారని ఇండియా టుడే నివేదించింది.
గ్యాంగ్‌స్టర్ గౌరవ్ పడియాల్ అనుచరుడు మన్‌దీప్ ధరివాల్ విక్కీ మిద్దుఖేరా హంతకులకు సాయం చేశాడు. ఫిలిప్పీన్స్‌లో ఇతడు హత్యకు గురయ్యాడు. గ్యాంగ్‌స్టర్ కౌశల్ చౌదరి కూడా హిట్ లిస్ట్‌లో ఉన్నాడు. ఆయన లారెన్స్ బిష్ణోయ్ ప్రత్యర్థి ముఠా అయిన బంబిహా గ్యాంగ్‌లో భాగం. అతని సహచరుడు అమిత్ దాగర్ మిద్దుఖేరా కూడా హిట్ లిస్టులో ఉన్నాడు. నివేదిక ప్రకారం.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ 11 రాష్ట్రాల్లో 700 మంది షూటర్లతో భారీ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.
బాబా సిద్ధిఖీని ముంబైలోని ఆయన కార్యాలయం బయట ముగ్గురు దుండగులు వచ్చి కాల్చిచంపారు. లారెన్స్ బిష్ణోయ్ సహచరులే ఈ హత్యకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత సిద్దిఖీ హత్య వెనుక పెద్ద ముఠానే ఉందని విషయం వెలుగులోకి వచ్చింది. సల్మాన్‌ఖాన్‌తో ఉన్న సంబంధాల కారణంగానే బాబా సిద్ధిక్ హత్యకు గురయ్యారని సోషల్ పోస్ట్‌లో పేర్కొన్నారు. సిద్ధిక్ కుమారుడు జీషన్ కూడా ముఠా హిట్ లిస్టులో ఉన్నాడని సమాచారం.