Hyderabad Hubli Flight : 4 గంటలు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం.. ప్రాణ భయంతో గుక్కపట్టి ఏడ్చిన ప్రయాణికులు
Hyderabad Hubli Flight : హైదరాబాద్ నుంచి హుబ్లీ బయలు దేరిన విమానం సాంకేతిక సమస్యల వల్ల సుమారు 4 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది.
bad weather and technical issue hyderabad hubli Fly91 flight faces mid air scare
- ఫ్లై91 విమానంలో సాంకేతిక లోపం
- ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి అనుకూలించని వాతావరణం
- 4 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం
Hyderabad Hubli Flight : సాంకేతిక సమస్యలు, వాతావరణంలో మార్పుల కారణంగా ఈ మధ్య కాలంలో విమానాలు గాల్లోనే చక్కర్లు కొట్టడం, మధ్యలోనే ఎమర్జెన్సీ ల్యాండ్ అవ్వడం వంటి ఘటనలు తరచుగా వెలుగు చూస్తున్నాయి. దీంతో చాలా మంది విమానాలు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. గాల్లోకి టేకాఫ్ అయిన విమానం.. ప్రతికూల వాతావరణం, సాంకేతిక లోపం వల్ల సుమారు నాలుగు గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీంతో విమానంలోని ప్రయాణికులు ప్రాణాలు అరచేత పట్టుకుని.. భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. కాపాడమంటూ దేవుడిని వేడుకున్నారు. వారి అదృష్టం బాగుండి చివరకు విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది.
వివరాల్లోకి వెళ్తే.. ఫ్లై91 ఎయిర్‌లైన్స్‌కు చెందిన IC3401 విమానం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హుబ్బళ్లి (హుబ్లీ)కి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం అయితే ఇది ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు హుబ్లీ చేరుకోవాల్సి ఉంది. కానీ, గమ్యస్థానానికి కొద్ది దూరంలో ఉండగానే ఆ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు వాతావరణం కూడా అనుకూలించకపోవడంతో.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అవకాశం లేకపోయింది. దీంతో సుమారు నాలుగు గంటల పాటు అది గాల్లోనే చక్కర్లు కొట్టింది.
పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి, విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానం ముండగోడ్, దావణగెరె, శివమొగ్గ ప్రాంతాల్లోనే చక్కర్లు కొట్టింది. సమస్య కొలిక్కి వచ్చి ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా.. హుబ్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వాతావరణ ప్రతికూలత వల్ల ల్యాండింగ్‌కు అవకాశం లేకపోవడంతో.. పైలట్లు అప్రమత్తమయ్యారు. చివరకు ఏటీసీ సూచనల మేరకు విమానాన్ని వెనక్కి మళ్లించారు.
సుమారు 4 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానాన్ని చివరకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి.. ఆదివారం రాత్రి 7.30 గంటలకు అక్కడ సురక్షితంగా ల్యాండ్ చేశారు. గాల్లో విమానం నాలుగు గంటలకుపైగా నిలిచిపోవడంతో ప్రయాణికులు భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటూ కాపాడమంటూ దేవుడ్ని వేడుకున్నారు. విమానం బెంగళూరుకు చేరుకోవడంతో అప్పటి వరకు చావు భయంతో గడిపిన ప్రయాణికులు.. క్షేమంగా దిగడంతో ఊపిరి పీల్చుకున్నారు. భద్రతా కారణాలతోనే బెంగళూరుకు మళ్లించినట్టు విమానయాన సంస్థ తెలిపింది. వారిని తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు పేర్కొంది.
