Bangladesh PM : మోదీ,దీదీకి మామిడి పండ్లు పంపిన బంగ్లాదేశ్ ప్రధాని

బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆదివారం.. 2,600 కేజీల మామిడి పండ్లను భారత ప్రధాని నరేంద్ర మోదీ,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బహుమతిగా పంపారు.

Bangladesh PM బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆదివారం..2,600 కేజీల మామిడి పండ్లను భారత ప్రధాని నరేంద్ర మోదీ,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బహుమతిగా పంపారు. బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్ జిల్లాలో ప్రత్యేకంగా పండించే హరిభాంగా రకం మామిడి పండ్లను 260 బాక్సుల్లో ఆ దేశ లారీల్లో రవాణా చేశారు. ఆ వాహనాలను భారత-బంగ్లా సరిహద్దుల్లోని బెనాపోల్ చెక్ పాయింట్ వద్ద కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి అక్కడి నుంచి కోల్ కతా లోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ఫస్ట్ సెక్రటరీ కార్యాలయానికి పంపారు. బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ఫస్ట్ సెక్రటరీ మహమ్మద్ సైముల్ ఖాదర్.. కస్టమ్స్‌ ఫార్మాలిటీల అనంతరం ఈ మామిడి పండ్లను ఢిల్లీలో ప్రధానికి, కోల్ కతా లో మమతకు పంపనునట్టు తెలిసింది.

భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య స్నేహానికి చిహ్నంగా ప్రధానమంత్రి షేక్ హసీనా ఈ మామిడి పండ్లను ప్రధాని మోదీ, సీఎం మమతకు బహుమతిగా పంపారని బెనపోల్ కస్టమ్స్ హౌస్ డిప్యూటీ కమిషనర్ అనుపమ్ చక్మా తెలిపారు. అయితే బంగ్లాదేశ్‌తో సరిహద్దు కలిగిన ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాల సీఎంలకు కూడా మామిడి పండ్లను పంపే యోచనలో బంగ్లాదేశ్ ఉన్నట్లు సమాచారం.

మరోవైపు, గత వారం పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ..పశ్చిమబెంగాల్లో పండే విభిన్న రకాల మామిడి పండ్లను సీఎం మమతా బెనర్జీ.. తన రాజకీయ ప్రత్యర్ధులైన ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, విపక్ష కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ సహా పలువురు నేతలకు పంపారు. ఏడాది పొడవునా ఎన్ని రాజకీయాలు చేసినా ప్రతి ఏటా వేసవిలో మామిడి పండ్లను మాత్రం ఢిల్లీలో సహచర రాజకీయ నేతలకు పంపడం ద్వారా మమతా బెనర్జీ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు