ఓ మహాత్మా: గాంధీజీకి ఘన నివాళి

  • Publish Date - January 30, 2019 / 03:49 AM IST

ఢిల్లీ : భరత జాతి చరిత్రలో అదొక మరపురాని..మరచిపోలేని రుథిర చరిత్ర. బాపూజీ రుధిరంతో భారతమాత అల్లాడిన నెత్తుడి రోజు! ప్రపంచమంతా  యుద్ధాలతో..తడి ఆరని నెత్తుడి మరకలతో అల్లాడుతున్న..కాలంలో అహింసే అసలైన ఆయుధమని ప్రపంచానికి చాటిచూపిన మహోన్నతుడు..శాంతి మంత్రం జపించిన మహాత్ముడు..అనూహ్యంగా నేలకొరిగిన రోజు. అదే 30 జనవరి 1948. పూజ్య బాపూజీని హత్య చేసిన రోజు.

ఇటువంటి అద్భుతమైన ఓ మహోన్నతుడు ఈ భూప్రపంచం మీద నడయాడారా అనే సందేహం  ముందు తరాల వారు నమ్మలేకపోవచ్చు..అంటు మహాత్మా గాంధీని ఉద్దేశించి ప్రఖ్యాత వైజ్ఞానిక శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ అన్న మాటలివి.  గాంధీజీ జీవితం గురించి చదివినవారికి, గాంధీయిజాన్ని అర్థం చేసుకున్న వారికి ఈ మాటలు అతిశయోక్తిగా అనిపించవు. సత్యం, అహింస అనే ఆయధాలతో ప్రపంచానికి కొత్త దారి చూపిన మహాత్ముడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. అందుకే గాంధీయిజం ప్రపంచదేశాలకు ఇప్పుడొక పాఠమైంది.  ఆ మహానుభావుడు భరతీయులకు ‘జాతిపిత’ అయ్యారు. 

నేటి తరం.. గాంధీజీ సిద్ధాంతాలను అర్థం చేసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది. ఓ సినిమాలో పాట చెప్పినట్లుగా కొంత మంది ఇంటి పేరో, ఊరికొక్క వీధి పేరో కాదు గాంధీ. కరెన్సీ నోట్ మీద, నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ అంతకన్నా కాదు. భరత మాత తల రాతను మార్చిన విధాత గాంధీ.. తరతరాల యమ యాతన తీర్చిన వరదాత గాంధీ. భరతమాత దాస్య సంకెళ్లను తెంచి ప్రజలకు స్వేచ్ఛా వాయువుల్ని ఇచ్చి..దేశానికి దశ..దిశా..నిర్ధేశకుడు గాంధీజీ. 

ఆయన చరిత్ర అపురూపం..ప్రముఖ రచయిత మాటల్లో చెప్పాలంటే.. కర్మ యోగమే జన్మంతా.. ధర్మ క్షేత్రమే బ్రతుకంత. సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి, తూరుపు తెలరని నడిరాత్రికి స్వేచ్ఛా బాణుడి ప్రభాత కాంతి. పదవులు కోరని పావని మూర్తి.. హృదయాలేలిన చక్రవర్తి.

కాగా, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, జాతిపితగా భారతీయులందరిచే ఆదరింపబడే స్వాతంత్రసమరయోధుడు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటిన మహాత్మాగాంధీ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. కేవలం భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికే ఆదర్శపాయుడుగా నిలిచిన గాంధీజీ నేలకొరిగిన చీకటి రోజు జనవరి 30 1948 . నాథూరామ్ గాడ్చే తుపాకీ తూటాకు బలైపోయిన రోజు..ఢిల్లీలోని బిర్లా హౌస్ లో జాతిపిత గాంధీజీ హేరామ్‌ నేలకొరిగిన  రోజు..గాంధీజీ మరణంతో భారత చరిత్రలో ఒక శకం ముగిసింది! ఎన్నటీకీ ఆరిపోని చైతన్య దీప్తీ..ఆదర్శ వెలుగు..ఓ అమరజ్యోతిగా  మిగిలింది!!

 

ఈ సందర్భంగా పూజ్య బాపూజీకి ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్..రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులతో సహా పలువురు ప్రముఖులు ఢిల్లీలోని బాపూ ఘాట్ వద్ద ఘన నివాళులర్పించారు.