గ్రామంలో అభివృద్ధి ఏం చేశారని నిలదీసిన ఇద్దరు యువకులకు రెవెన్యూ అధికారులు ఇచ్చిన సమాధానం షాక్ కొట్టినంత పనైంది.
హనుమాన్ గఢ్ : గ్రామంలో అభివృద్ధి ఏం చేశారని నిలదీసిన ఇద్దరు యువకులకు రెవెన్యూ అధికారులు ఇచ్చిన సమాధానం షాక్ కొట్టినంత పనైంది. సమాచార హక్కు ప్రకారం తమ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి చేశారో తెలపాలంటూ ఇద్దరు యువకులు ప్రభుత్వ అధికారుల్ని నిలదీశారు. అందుకు వారికి సమాధానంగా వాడేసిన కండోమ్ పార్సిల్స్ పంపడంతో ఊరంతా అవాక్కయింది.
రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ జిల్లా, భద్ర తహసీల్ పరిధిలోని చానీ బడి గ్రామంలో జరిగిన ఈ ఘటనపై ఊరు ఊరంతా భగ్గుమంది. 2001 నుంచి గ్రామంలో చేపట్టిన అభివృద్ధికి సంబంధించిన సమాచారం తెలపాలంటూ గ్రామంలోని వికాశ్ చౌదరీ, మనోహర్ లాల్ అనే ఇద్దరు బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారులను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా బీవీవో నుంచి వారికి రెండు పార్సిల్స్ వచ్చాయి. తమకు వచ్చిన పార్సిల్స్ కవర్ ను విప్పి చూశారు. పేపర్ లో చుట్టిన కండోమ్ లు బయటపడ్డాయి.
దీంతో రెండో కవర్ ను విప్పకుండా బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి (బీడీవో)ని, గ్రామ పెద్దలను పిలిపించారు. రెండవ పార్సిల్ ను విప్పాల్సిందిగా కోరారు. అందుకు బీడీవో ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వీడియో తీస్తూ గ్రామ పెద్దల సమక్షంలో ఆ పార్సిల్ విప్పారు. అందులో వాడిపడేసిన కండోమ్ లే కనిపించాయి. ఈ విషయంపై ఆగ్రహించిన గ్రామస్థులు హనుమాన్ గఢ్ జిల్లా పరిషత్ సీఈవో నవ్‌నీత్ కుమార్ కు చూపించి ఫిర్యాదు చేశారు. ఎవరో కావాలని చేసి ఉంటారని.. దీనిపై విచారణ జరిపించి నిందితులపై చర్యలు తీసుకుంటామని నవ్‌నీత్ కుమార్ తెలిపారు.