రంగంలోకి భారత బాహుబలులు.. విమానాలు, హెలికాప్టర్ల ద్వారా నిమిషాల్లో భారీ ఆయుధాలను లద్దాఖ్ సరిహద్దులకు చేర్చిన ఐఏఎఫ్‌

భారత్, చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు కుతంత్రాలకు తెరలేపింది చైనా. చైనా సైనికులు పెద్ద సంఖ్యలో భారత సరిహద్దులకు చేరుతున్నారు. చర్చల పేరుతో చైనా చేస్తున్న డ్రామాలను పసిగట్టిన భారత్ వెంటనే అలర్ట్ అయ్యింది. చర్చల పేరుతో సమయం వృథా చేయడం భారత్‌కు ప్రమాదకరమని గ్రహించింది. వెంటనే సరిహద్దులకు శతఘ్నులు, యుద్ధట్యాంకులను తరలించడమే తరోణాపాయమని భావించింది. అంతే, వాయుసేనలోని బాహుబలులు, భారీ కాయులు రంగంలోకి దిగారు. భారత్‌కు చెందిన వ్యూహాత్మక ఆయుధాలను సరిహద్దులకు చేర్చారు. భారత్‌ అంత వేగంగా మోహరించగలదని చైనా కూడా అంచనా వేయలేకపోయింది.

అరుదైన వైమానిక సంపద మన సొంతం:
భారత్‌ అమ్ముల పొదిలో అత్యధిక బరువును మోయగలిగే విమానాలు, హెలికాప్టర్లు భారీ సంఖ్యలో ఉన్నాయి. వీటి ద్వారా పదాతి దళాలు, భారీ యుద్ధ శకటాలను సరిహద్దులకు గంటల వ్యవధిలో తరలించవచ్చు. వీటిల్లో సీ17 గ్లోబ్‌ మాస్టర్‌(C-17 Globemaster), సీ 130 సూపర్‌ హెర్క్యూలెస్‌(C-130 Super Hercules), సీహెచ్‌ 47 షినూక్(CH-47 Chinook)‌, ఎంఐ17(M-17) హెలికాప్టర్లు వంటివి రంగంలోకి దిగాయి. 1980 వరకు భారత్‌ దగ్గర ఐఎల్‌76, ఏఎన్‌32 వంటివి ఉండేవి. ప్రస్తుతం వీటితోపాటు కొన్నేళ్లుగా అత్యాధునిక విమానాలు, హెలికాప్టర్లను కొనుగోలు చేస్తున్నారు.

టీ-90లే కీలకం:
భారత అమ్ముల పొదిలో టి-90(T-90) అత్యంత శక్తివంతమైన ట్యాంక్‌. దీనిని సరిహద్దులకు తరలించడంతో మన బలగాలకు వెయ్యేనుగుల బలం వచ్చినట్లే. దీని బరువు దాదాపు 46టన్నులకు పైగా ఉంది. గతంలో ఐఎల్‌ 76 విమానం అత్యధికంగా 45 టన్నులు మాత్రమే మోయగలదు. దీంతో సీ17 గ్లోబ్‌ మాస్టర్‌ విమానాలు ఈ ట్యాంకుల తరలింపులో చురుకైన పాత్ర పోషించనున్నాయి. ఇవి దాదాపు 77 టన్నులను మోయగలవు. అత్యధిక ఎత్తుల్లో సాధారణంగా విమానాలు పూర్తి సామర్థ్యంతో బరవు మోయలేవు. సీ17 సామర్థ్యం తగ్గించుకొన్నా.. 46టన్నులను తేలిగ్గా రవాణ చేయగలదు. ఇదే సమయంలో మరికొన్ని ట్యాంకర్లను రోడ్డుమార్గంలో కశ్మీర్‌ వైపు నుంచి తరలించే అవకాశం ఉంది.

శతఘ్నుల తరలింపునకు షినూక్‌లు:
భారత్‌కు చెందిన శతఘ్నులను అత్యవసరమైన ప్రాంతాలకు తరలించేందుకు ఇటీవల అమెరికా నుంచి కొనుగోలు చేసిన షినూక్‌ హెలికాప్టర్లు ఉపయోగపడనున్నాయి. ఇవి భారత్‌ దగ్గర 15 వరకు ఉన్నాయి. అదే సమయంలో దళాలు, ఆర్మర్డ్‌ వాహనాలను తీసుకెళ్లెందుకు సీ130 విమానాలు, ఎంఐ17 హెలికాప్టర్లు ఉండనే ఉన్నాయి. భారత్‌ దగ్గర 11 సీ-130 విమానాలు, 11 సీ-17 గ్లోబ్‌ మాస్టర్లు సర్వీసులో ఉండగా 220 ఎంఐ-17 హెలికాప్టర్లు ఉన్నాయి. వీటిల్లో అన్ని లద్దాక్‌ సమీపంలోని దౌలత్‌ బేగ్‌ ఓల్డీ ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండ్‌ కాగలిగే సామర్థ్యం ఉన్నవి కావడం విశేషం.

Read:రహస్యంగా యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేస్తున్న TikTok