బీజేపీలో చేరిన 15మంది కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమై,పార్టీ విప్ ను ఉల్లంఘించారంటూ అనర్హత వేటుకు గురైన 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేల్లో 15 మంది ఇవాళ(నవంబర్-14,2019)బెంగళూరులో కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప సమక్షంలో బీజేపీలో చేరారు. గడిచిన 3 నెలలుగా సుప్రీంకోర్టులో పోరాడుతున్న అనర్హ ఎమ్మెల్యేల కేసులో తుది తీర్పు బుధవారం వెల్లడైన విషయం తెలిసిందే. న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు ప్రకటించింది.

అనర్హత వేటు పడిన 17 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇవాళ(నవంబర్-13,2019) సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఈ ఏడాది జులైలో నాటి అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. ఈ రెబల్స్ అంతా 2023 వరకు సభాకాలం ముగిసే దాకా ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ స్పీకర్ విధించిన నిషేధాన్ని కొట్టివేసింది. మళ్లీ పోటీ చేయడంపై స్పీకర్ నిర్ణయం తీసుకోలేరని కోర్టు సృష్టం చేసింది. 3 స్థానాలు మినహా 12 చోట్ల వారికే టిక్కెట్లు ఇవ్వాలని బీజేపీ కోర్‌ కమిటీ ఇప్పటికే తీర్మానించింది.

కర్ణాటక అసెంబ్లీలో 15 స్థానాలకు (అక్టోబర్ 21, 2019) ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పటికే ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 18న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ. డిసెంబర్ 9, 2019న ఫలితాలు వెలువడనున్నాయి.